న్యూఢిల్లీ: భారత్‌లో యాపిల్ సంస్థను విస్తరించొద్దని ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన విషయం తెలిసిందే. అయితే ఆపిల్ బాస్ టిమ్ కుక్ ట్రంప్ ఉద్బోధను తిరస్కరించారు. భారత్‌లో ఉత్పత్తిని విస్తరించడం ద్వారా యాపిల్‌కు గణనీయమైన ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
భారత్‌లో తయారీ రంగం అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు అనుకూలంగా ఉందని, ఇక్కడ ఉత్పత్తి చేయడం ద్వారా యాపిల్ వంటి సంస్థలు పోటీతత్వాన్ని అందిపుచ్చుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో అధిక శాతం జూన్ త్రైమాసికం నుంచి “మేడ్ ఇన్ ఇండియా” ట్యాగ్‌తో ఉంటాయని యాపిల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, ఈ ప్రయోజనాలను కంపెనీ గుర్తించాలని వారు సూచించారు. “కంపెనీల పెట్టుబడి నిర్ణయాలు వారి పోటీతత్వంపైనే ఆధారపడి ఉంటాయి” అని వారు పేర్కొన్నారు.
ట్రంప్ చెప్పిన దాని ఆధారంగా కంపెనీ తన భారత పెట్టుబడి ప్రణాళికలను మార్చుకునే ఆలోచన ఏమీలేదని ఆపిల్ వర్గాలు తెలిపాయి. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు వార్తా సంస్థ PTIకి దేశంలో ఒక ప్రధాన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని చెప్పారు.
పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఖతార్‌లో జరిగిన ఓ వాణిజ్య సదస్సులో ట్రంప్ ఆపిల్ సీఈఓ టిమ్‌కుక్‌తో మాట్లాడుతూ… “మిత్రమా, నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీరు భారత్‌లో తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని వింటున్నాను. మీరు భారత్‌లో నిర్మించవద్దు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటి, కాబట్టి అక్కడ అమ్మడం చాలా కష్టం,” అని టిమ్ కుక్‌తో అన్నట్లు తెలిపారు. యాపిల్ తన ఫ్యాక్టరీలను అమెరికాకు తరలిస్తుందని కూడా ట్రంప్ పేర్కొన్నప్పటికీ, కంపెనీ నుంచి అలాంటి ప్రకటన ఏదీ వెలువడలేదు.
కాగా, తయారీరంగం వృద్ధి కోసం అమెరికాలో $500 బిలియన్లను పెట్టుబడి పెట్టడానికి ఆపిల్ కట్టుబడి ఉంది, కానీ వాస్తవాలు చాలా భిన్నంగా ఉన్నాయి. 2024 నాటికి అమెరికాలో అమ్ముడైన దాదాపు 76 మిలియన్ల ఐఫోన్‌లను తయారు చేయడానికి తగినంత పెద్ద సప్లై చైన్ ఆ దేశంలో తక్షణమే ఏర్పాటు చేయడం కష్ట సాధ్యం. అందుకుగాను పదివేల బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని విశ్లేషకులు తెలిపారు.
యాపిల్ ఆదాయంలో దాదాపు 50 శాతం వాటా కలిగిన ఐఫోన్‌ల కోసం సోర్సింగ్ వ్యూహాలలో విభజనను కుక్ సూచించిన తర్వాత కూడా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్లను భారత్‌లో తయారు చేయాలని, మిగిలిన ప్రపంచ దేశాల కోసం చైనాలోని ప్లాంట్లలో ఉత్పత్తి కొనసాగించాలని యాపిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. చైనాలో తయారై అమెరికాకు ఎగుమతి అయ్యే ఐఫోన్లపై భారీ సుంకాలను తప్పించుకోవడానికి కూడా ఈ వ్యూహం ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో దాదాపు 15% భారత్ నుంచే జరుగుతోందని అంచనా. అలాగే తెలంగాణలో తయారవుతున్న AirPods వంటి ప్రసిద్ధ ఉపకరణాలు కూడా ఉన్నాయి.
ఇదిలా ఉండగా గత నెల ఏప్రిల్‌లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ… ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కోట్ల విలువైన iPhoneలు ఎగుమతి అయ్యాయని చెప్పారు. స్థానిక తయారీని ప్రోత్సహించడానికి, చైనాపై పైచేయి సాధించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమాలైన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరింత బలోపేతం చేస్తుంది.