హైదరాబాద్ : గత రెండు రోజుల్లో, తెలంగాణలోని ములుగు పోలీసులు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌లో భాగంగా 20 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. కర్రెగుట్ట ప్రాంతం ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, పేరూరు పోలీస్ స్టేషన్లతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎలిమిడి, ఉసుర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వస్తుంది.
అరెస్ట్ అయిన మావోయిస్టులనుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. 24 గంటల్లో లొంగిపోయిన వారి ఆకౌంట్‌లో రివార్డు డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మిగతా మావోయిస్టులంతా అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.
నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు ముందుకెళ్తున్నాయి. ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండల్లో సీఆర్పీఎఫ్, ఛత్తీస్ గఢ్ పోలీసులు ఇటీవల పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కర్రెగుట్టలో ఆశ్రయం పొందుతున్న మావోయిస్టు సభ్యులు అక్కడి నుంచి చిన్న చిన్న బృందాలుగా విడిపోయి… వేరే ప్రాంతాలకు పారిపోతున్నట్లు ములుగు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో అప్రమత్తమైన ములుగు జిల్లా పోలీసులు… జిల్లాలోకి మావోయిస్టుల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు వీలుగా నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. మావోయిస్టులు తమ ప్రాంత పరిధిలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి సమగ్ర భద్రతా చర్యలను అమలు చేశారు. విస్తృత తనిఖీలు చేపట్టగా… మావోయిస్టులను పట్టుకున్నారు. ఆపరేషన్ సమయంలో పోలీసులు తుపాకీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలు, ఇతరులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి… మావోయిస్టులు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఐఇడి బాంబులను అమర్చారని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ పి. శబరీష్ తెలిపారు.
దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్రం తీసుకువచ్చిన కార్యాచరణే ఆపరేషన్ కగార్. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా వారిని ఏరివేయడం కోసం కేంద్రప్రభుత్వం ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కొన్నాళ్లుగా జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లు సంచలనంగా మారాయి. తెలంగాణలోని ములుగు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లోని ఎత్తయిన కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం 21 రోజులపాటు ఆపరేషన్ కగార్‌ను నిర్వహించారు.