జైపూర్ : సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌పై (SDM) 2005లో తుపాకీతో బెదిరించిన కేసులో దోషిగా తేలిన తర్వాత రాజస్థాన్ అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే కన్వర్ లాల్ మీనాను అనర్హుడిగా ప్రకటించింది. అతని అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దును ధృవీకరిస్తూ అసెంబ్లీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1)(E) మరియు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని అంటా ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశారు. మీనా సభ్యత్వం రద్దు చేయడం ఆయన దోషిగా తేలిన తేదీ నుండి అమలులోకి వస్తుందని అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని అన్నారు.
తత్ఫలితంగా, బరాన్ జిల్లాలోని అంట (193) అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉందని దేవ్నాని పేర్కొన్నారు. రాజస్థాన్ అడ్వకేట్ జనరల్ నుండి న్యాయ సలహా పొందిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు. ఈ కేసులో తాను మొత్తం చట్టపరమైన ప్రక్రియను అనుసరించానని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగలేదని దేవ్నాని అన్నారు. “ఒక ఎమ్మెల్యే దోషిగా తేలిన కేసుల్లో ఉన్నప్పుడు, అతని/ఆమె సభ్యత్వం దానికదే రద్దవతుంది. కోర్టు నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
“అన్ని నిర్ణయాలు చట్టానికి అనుగుణంగానే తీసుకుంటాము. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకున్నామని స్పీకర్ అన్నారు.” మునుపటి స్పీకర్లు కూడా ఇలాంటి కేసులను అధ్యయనం చేసి చర్యలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని దేవ్నాని హెచ్చరించారు, ఈ విషయం పూర్తిగా చట్టబద్ధంగానే వెళ్లామని స్పీకర్ చెప్పారు.
ఎమ్మెల్యే కన్వర్లాల్‌కు సంబంధించి కోర్టు తీర్పు రోజున న్యాయవాదిని అందించాలని అడ్వకేట్ జనరల్‌ను కోరినట్లు ఆయన వివరించారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం, దోషిగా తేలిన తేదీ నుండి ఒక ఎమ్మెల్యే అనర్హుడిగా ఉంటాడు. ఆ స్థానం ఖాళీగా ఉందని శాసనసభ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. శాసనసభ కార్యకలాపాల్లో పాల్గొనడానికి , అవసరమైనప్పుడు చట్టపరమైన అభిప్రాయాలను అందించడానికి అడ్వకేట్ జనరల్‌కు రాజ్యాంగ అధికారం ఉందని పేర్కొంటూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 177ను కూడా ఆయన ప్రస్తావించారు. అంతకుముందు, అసెంబ్లీ సెక్రటేరియట్ కన్వర్లాల్‌కు నోటీసు జారీ చేసింది, మే 7 లోపు ఆయన స్పందించాలని కోరింది.
తన శిక్షను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నుండి తనకు ఏదైనా ఉపశమనం లభించిందా లేదా అని స్పష్టం చేయాలని ఆయనను కోరారు. సుప్రీంకోర్టు శిక్షను నిలిపివేయకపోవడంతో, స్పీకర్‌కు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం తప్ప వేరే మార్గం లేదు.
మరోవంక, రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు టికారం జూలీ దోషిగా తేలిన ఎమ్మెల్యే కన్వర్‌లాల్ మీనా అనర్హతను “న్యాయం, సత్యం, రాజ్యాంగ విజయం”గా స్వాగతించారు. రాజ్యాంగ విలువలను కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం ఫలితంగా అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న చర్యను ఆయన అభివర్ణించారు.
“సత్యమేవ జయతే – నిజం గెలిచింది. రాజ్యాంగాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమ విజయం ఇది” అని జూలీ అన్నారు. కాంగ్రెస్ తన వైఖరిలో దృఢంగా ఉండి, రాజ్యాంగ విలువలను కాపాడటానికి అవిశ్రాంతంగా పోరాడిందని పేర్కొంటూ, జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేల దార్శనికత, సంకల్పానికి ఈ విజయం ఒక ఉదాహరణగా ఆయన అభివర్ణించారు.
కాంగ్రెస్ పార్టీ ‘సేవ్ కాన్స్టిట్యూషన్’ ప్రచారంలో జూలీ ఈ చర్యను కీలక మైలురాయిగా అభివర్ణించారు, వారి పోరాటం చట్ట పాలన, ప్రజాస్వామ్య సూత్రాలలో పాతుకుపోయిందని నొక్కి చెప్పారు. “మా ఉద్యమం మా నాయకులు చూపిన మార్గాన్ని అనుసరించింది, చివరికి రాజ్యాంగం గెలిచింది. దాని గౌరవం కాపాడుకున్నామ” అని ఆయన అన్నారు.