32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

ఫ్లిప్​కార్ట్​తో సెర్ప్ ఒప్పందం… ఈ ఏడాది 500కోట్ల వ్యాపారమే లక్ష్యం!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రముఖ ఆన్​లైన్​ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌తో రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై మహిళా సంఘాలు తయారు చేసే వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో సెర్ప్​ సీఈవో, ఫ్లిప్​కార్ట్​ ఉపాధ్యక్షురాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దాదాపు 140 రకాల ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫాంపై మార్కెట్‌ చేసేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.  దేశంలో ఒక రాష్ట్రప్రభుత్వంతో ఫ్లిప్‌కార్ట్‌ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిది.

 దళారుల బెడద లేకుండా… బియ్యం, పసుపు, మిర్చి, పండ్లు, పప్పుధాన్యాలు, సీజనల్‌ ఉత్పత్తులను కంపెనీకి విక్రయించి రైతు సంఘాలు లాభాలబాటలో పయనిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 40 కోట్ల కస్టమర్ బేస్‌తో, ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి ఫ్లిప్‌కార్ట్ మంచి వేదిక అవుతుంది. ఫలితంగా, ఎంఒయు ఆదాయం, వ్యాపార వృద్ధిని మెరుగుపరచడంలో దోహదపడుతుందని మంత్రి అన్నారు.  పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సెర్ప్ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, ఫ్లిప్​కార్ట్ సంస్థ ఉపాధ్యక్షురాలు స్మృతి రవిచంద్రన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

తెలంగాణలోని డ్వాక్రా సంఘాలు, ఎఫ్‌పిఓలు నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ మార్కెటింగ్ సవాలుగా మారింది. చాలా ఉత్పత్తుల విక్రయాలు రాష్ట్ర పరిమితులకే పరిమితమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌తో ఈ అవగాహన ఒప్పందం ఇప్పుడు జాతీయ వేదికను అందిస్తుంది అని సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు.

ఈ సందర్భంగా పంచాయత్‌రాజ్‌ శాఖ మంత్రి ఈ దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 4,36,000 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, ఇందులో 46 లక్షల మంది సభ్యులున్నారని తెలిపారు.  అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మల్టీ నేషనల్‌ కంపెనీ మహిళా స్వయం సహాయక సంఘాలతో ఒప్పందం చేసుకోవడం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ సాధించిన విజయాల్లో ఒకటని పేర్కొన్నారు.
ఈ ఏడాది 500 కోట్ల వ్యాపార లక్ష్యంతో ఒప్పందం కుదిరిందని, ఫ్లిప్‌కార్ట్‌తో ప్రయా ణం మహిళా సంఘాలకు, రైతులకు ఎంతో లాభం చేకూరుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. గత ఏడాది రూ.15 వేల కోట్ల రుణాలు ఇస్తే, ఈ ఏడాది రూ. 18 వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యం గా పెట్టుకొన్నామని మంత్రి వివరించారు.
ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్, గ్రోసరీ హెడ్ స్మృతి రవిచంద్రన్ మాట్లాడుతూ… ఈ తరహా ఒప్పందం చేసుకొన్న తొలి రాష్ట్రం తెలంగాణే.  భౌగోళికంగా కూడా వ్యాపారానికి తెలంగాణ అనువైనది. ఇక్కడి మహిళా సంఘాలు చాలా బలంగా, చైతన్యవంతంగా ఉన్నాయి. వీరి అనుభవం మా కంపెనీకి ఎంతో ఉపయోగపడుతుందని ఆమె ఆన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles