ఈ ఏడాది హజ్ యాత్రలో సౌదీ అరేబియా సాంకేతికతకు పెద్దపీట వేసింది. మనారహ్ 2 అనే ఏఐ రోబోను కొత్తగా ప్రవేశపెట్టింది. ఇది హజ్ యాత్రికులకు మార్గనిర్దేశం చేయనుంది. ఈ రోబో అరబిక్, ఇంగ్లీష్, బెంగాలీ, మలయాళం, ఉర్దూ భాషల్లోనూ మాట్లాడగలదు.
ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది అల్లాహ్ అతిథులుగా మక్కాకు వచ్చే హజ్ యాత్రికులకు సౌదీ అరేబియా ఆతిథ్యమిస్తోంది. అందుకోసం అత్యాధునిక ఏర్పాట్లను చేసింది. ఈ సారి, మక్కా – మదీనా లోని పవిత్ర యాత్రను సులభతరం చేయడానికి కృత్రిమ మేధస్సు (AI) , స్మార్ట్ టెక్నాలజీని వినియోగించేందుకు సౌదీ అరేబియా చర్యలు తీసుకుంది.
మక్కా లోని మస్జిదే హరమ్ షరీఫ్ మదీనా లోని మస్జిదె నబవీలో చాలా రకాల డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు తొలిసారి ప్రవేశపెట్టారు. వీటిలో మనారహ్ 2 అనే రెండవ తరం ఎయ్.ఐ. రోబో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది యాత్రికులకు మార్గనిర్దేశం చేయగలదు. ఈ రోబో గ్రాండ్ మస్జిద్‌లో ఏర్పాటు చేశారు, దీనిలో 21-అంగుళాల టచ్‌స్క్రీన్, 5G నెట్‌వర్క్మ , హై-రిసల్యూషన్ కెమెరాలు ఉన్నాయి.
మనారహ్ 2 మొత్తం 11 భాషల్లో మాట్లాడగలదు. ఇస్లామిక్ షరియత్ సంబంధిత తరచుగా అడిగే ప్రశ్నలకు ఆటోమేటెడ్ సమాధానాలు ఇవ్వగలదు. క్లిష్టమైన ప్రశ్నలకు, యాత్రికులను వీడియో కాల్ ద్వారా అర్హత గల ఇస్లామిక్ పండితులతో మాట్లాడిస్తుంది. అరబిక్, ఇంగ్లిష్‌తో పాటు బెంగాలీ, మలయాళం, ఉర్దూ భాషలలో కూడా ఇది పనిచేస్తుంది.
భారీ జనసంచారాన్ని పర్యవేక్షించడానికి గ్రౌండ్ సెన్సార్లు, గేట్ రీడర్లు, ఎ.ఐ ఆధారిత నిఘా వ్యవస్థలు ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా వచ్చే డేటా వీడియోలతో సహా పెద్ద మొత్తంలో సమాచారం విశ్లేషించడానికి సౌదీ అధికారులు అత్యాధునిక AI సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తున్నారు. ఈ పవిత్ర క్రతువులో ఎలాంటి అపశ్రుతులు జరగకుండా, తొక్కిసలాటలకు తావులేకుండా లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ప్రధాన ప్రదేశాల్లో బహుభాషా స్మార్ట్ స్క్రీన్లు ఏర్పాటు చేసి యాత్రికులకు తక్షణ సమాచారం, సహాయం అందిస్తున్నారు.
డిజిటల్ ఖురాన్ ప్లాట్‌ఫామ్ ఖురాన్ పఠనం, అధ్యయనానికి మద్దతు ఇస్తుంది. అలాగే, సూరతుల్-ఫాతిహా అనే యాప్ ఖురాన్‌లోని అత్యంత ఎక్కువగా పఠించబడే అధ్యాయాన్ని బాగా అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది. అంతేకాదు విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన యాత్రికులకు ఆధ్యాత్మిక, మేధోపరమైన, విద్యా సహాయం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా అమలులో ఉంటాయి.
- ముహమ్మద్ ముజాహిద్