జెరూసలేం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యంలో”భారీ సంఘర్షణ” సంభవించే అవకాశం ఉందని హెచ్చరించిన తర్వాత, ఇరాన్‌పై ఇజ్రాయెల్ “ముందస్తు” దాడులు నిర్వహించింది. అణు కర్మాగారం, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో ఇరాన్‌కు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి హుస్సేన్ సలామీ మృతిచెందారు. ఈ మేరకు ఇరానియన్ స్టేట్ టెలివిజన్ తెలిపింది.
ఇరాన్ రాజధానిలో ఈరోజు ఉదయం పేలుళ్లు వినిపించాయని, ఇరాన్ వైమానిక రక్షణ విభాగం “100 శాతం అప్రమత్తంగా” ఉందని ఆ దేశ టీవీ పేర్కొంది. ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ప్రత్యేక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇరాన్ ప్రతి దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెల్లడించారు. దేశంలో దాడులు జరుగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇరాన్‌లో తాము దాడులు నిర్వహించామని, దీంతో ఇజ్రాయెల్‌లో కూడా క్షిపణి లేదా డ్రోన్ దాడులు జరుగవచ్చని తెలిపారు.
ఈ దాడుల కారణంగా చమురు ధరలు 6 శాతం వరకు పెరిగాయి, ఇరాన్ దాడి జరిగే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించాక, ఈ ప్రాంతంలోని సిబ్బందిని అమెరికా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పిన తర్వాత ఇది జరిగింది.
“నేను వెంటనే జరుగుతుందని చెప్పదలచుకోలేదు, కానీ అది జరగడానికి చాలా అవకాశం ఉంది” అని ట్రంప్ గురువారం వైట్ హౌస్ వద్ద విలేకరులతో ఇజ్రాయెల్ దాడి జరుగుతుందా అని అడిగినప్పుడు అన్నారు.
ఇరాన్ అణు కార్యక్రమంపై ఒక మంచి ఒప్పందానికి “చాలా దగ్గరగా” ఉన్నామని తాను నమ్ముతున్నానని ట్రంప్ అన్నారు, కానీ తన ప్రధాన శత్రువుపై ఇజ్రాయెల్ దాడి ఒప్పందం అవకాశాలను నాశనం చేస్తుందని అన్నారు.
మరోవంక ఇజ్రాయెల్ దాడులతో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు . టెహ్రాన్‌పై దాడికి రావొద్దని, తమ దేశానికి చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. అమెరికా బలగాలను కాపాడుకోవడమే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పారు.
కాగా, ఇరాన్ అణు ఆశయాలను భగ్నం చేసే లక్ష్యంతో ఆపరేషన్ రైజింగ్ లయన్‌ను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. ఇరాన్ గుండె మీద కొట్టామని అన్నారు. “ఇజ్రాయెల్ మనుగడకు ముప్పుగా మారిన ఇరాన్‌ను తిప్పికొట్టడానికి లక్ష్యంగా చేసుకున్న సైనిక చర్య. ముప్పును తొలగించడానికి చేప్పటిన ఆపరేషన్ ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు కొనసాగుతుంది” అని నెతన్యాహు తెలిపారు.