హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సరికొత్త చరిత్ర సృష్టించింది. తొలి మహిళా డ్రైవర్‌గా సరిత నియమితులయ్యారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని మారుమూల తండాలో పుట్టిన సరిత… ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వరకు నాన్‌స్టాప్ ఎలక్ట్రిక్ బస్సు (జీబీఎం) నడిపారు. ఇది రాష్ట్ర ప్రజా రవాణా రంగంలో ఒక చిరస్మరణీయ మైలురాయిగా నిలిచింది.
యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన గిరిజన మహిళ వాంకుడోతు సరిత, మిర్యాలగూడ బస్ డిపోకు నియమితులయ్యారు. ఆమె హైదరాబాద్-మిర్యాలగూడ మార్గంలో ఎలక్ట్రిక్ JBM బస్సును నడుపుతుంది.
సరిత గతంలో ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (DTC)కి పదేళ్లపాటు డ్రైవర్‌గా పనిచేశారు, అక్కడ ఆమెను సరోజిని నగర్ బస్ డిపోలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. DTCలో ఉద్యోగం సంపాదించడం ద్వారా, ఆమె రాష్ట్ర నిర్వహణలో ఉన్న కార్పొరేషన్‌లో భారతదేశపు మొట్టమొదటి మహిళా బస్సు డ్రైవర్‌గా చరిత్ర సృష్టించింది.
అయితే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో వారిని చూసుకోవడానికి రాష్ట్రంలో బస్ డ్రైవర్‌గా అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సరితకు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా అవకాశం కల్పించారు.
ఆమె నియామకాన్ని అభినందిస్తూ, గృహ బాధ్యతలు, సామాజిక అభివృద్ధిలో మహిళల పాత్ర అపూర్వమైనదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ అడ్డంకులను అధిగమించి విజయ మార్గంలో ముందుకు సాగినందుకు, అందరికీ ఆదర్శంగా నిలిచినందుకు సీఎం ఆమెను ప్రశంసించారు.
కాగా, తెలంగాణ ఆర్టీసీ లో తొలి మహిళా డ్రైవర్ సరిత నియమితులైన సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సరితకు శుభకాంక్షలు తెలిపారు. గతంలో సరిత ఢిల్లీలో రవాణా సంస్థలో 10 సంవత్సరాలు డ్రైవర్‌గా విధులు నిర్వహించారని.. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తనకు స్వస్థలంలో డ్రైవర్ గా అవకాశం ఇవ్వాలని ఇటీవల కలిసి విజ్ఞప్తి చేశారని చెప్పారు. వెంటనే స్పందించి ఆర్టీసీ అధికారులతో జేబీఎంసంస్థ ప్రతినిధులతో మాట్లాడి తెలంగాణ ఆర్టీసీ మిర్యాలగూడ డిపోలో నియమించడం జరిగిందని తెలిపారు
మొత్తంగా లింగ నిబంధనలతో పోరాడుతూ తన కుటుంబాన్ని పోషించడానికి, పురుషాధిక్య రంగంలో తన స్థానాన్ని సంపాదించుకోవడానికి కృషి చేస్తున్నందున సరిత అందరికీ ప్రేరణగా నిలుస్తుంది.