28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ … మాల్దీవులకు పారిపోయిన అధ్యక్షుడు గోటబయ రాజపక్స!

కొలంబో: అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి మాల్దీవులకు పారిపోయిన కొన్ని గంటల తర్వాత శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు, ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే దేశవ్యాప్త అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో అత్యయిక స్థితి విధిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన చేసింది. పశ్చిమ ప్రావిన్స్​లో కర్ఫ్యూను విధిస్తున్నట్లు పేర్కొంది.

గోటబయ రాజపక్సే మాల్దీవులకు పారిపోయారని వార్తలు రావడంతో… శ్రీలంక రాజధాని కొలంబో వీధుల్లో వేలాది మంది నిరసనకారులు వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో పాటు నిరసనకు దిగారు. దీంతో  అల్లరిమూకలను అరెస్ట్ చేయాలని భద్రతా బలగాలను ప్రధాని ఆదేశించినట్లు ఆయన కార్యాలయం తెలిపింది.

మరోవైపు ప్రధాని రనిల్​ విక్రమసింఘే కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించారు. అధ్యక్షుడు రాజపక్స పరారైన నేపథ్యంలో విక్రమసింఘే కూడా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్​ చేశారు. అధికారులు నిరసనకారులను నియంత్రించేందుకు బాష్పాయువు ప్రయోగించారు. విక్రమసింఘే ప్రధాని పదవిని నుంచి ఈరోజు రాజీనామా చేయాల్సి ఉంది. ఈ విషయంపై ఇప్పటికే ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రణిల్​ తాత్కలిక అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.  ఆల్‌పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన పదవికి రాజీనామా చేస్తానని ప్రధాని విక్రమసింఘే ఇప్పటికే చెప్పారు.

అంతకుముందు, అధ్యక్షుడు రాజపక్సే, అతని భార్య, ఇద్దరు అంగరక్షకులు గత రాత్రి కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మేల్-బౌండ్ మిలిటరీ విమానంలో ఎక్కారు. ఆయన తమ్ముడు, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే కూడా దేశం విడిచి వెళ్లిపోయారని నివేదికలు పేర్కొన్నాయి.

మాల్దీవులకు చేరుకున్న తరువాత అధ్యక్షుడు రాజపక్సే, అతని భార్య,  అంగరక్షకులను పోలీసు ఎస్కార్ట్‌లో గుర్తు తెలియని ప్రదేశానికి తరలించినట్లు మాలేలోని విమానాశ్రయ అధికారి తెలిపారు. అధ్యక్షుడిగా, గోటబయ రాజపక్స అరెస్టు నుండి మినహాయింపు పొందారు. నిర్బంధానికి గురికాకుండా ఉండేందుకు రాజీనామా చేసే ముందు దేశం విడిచి వెళ్లాలని భావించినట్లు భావిస్తున్నారు.

బుధవారం రాజీనామా చేస్తానని, శాంతియుతంగా అధికార మార్పిడికి మార్గం సుగమం చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీలంక రాజకీయ పార్టీలు జులై 20న అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

ఆ వార్తలను ఖండించిన భారత్
మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు పారిపోయేందుకు భారత్​ సహకరించిందన్న వార్తను అక్కడి భారత హైకమిషన్​ ఖండించింది. మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు నిరాధారమైనవని తెలిపింది. శ్రీలంక సుస్థిర అభివృద్ధికి ఎల్లప్పుడూ భారత సహకారం ఉంటుందని స్పష్టం చేసింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles