హైదరాబాద్: దొంగతనం జరిగిన కొద్ది గంటలకే కేసును చేధించారు హైదరాబాద్ పోలీసులు. ఈమేరకు నార్త్‌జోన్ డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిర్యాదు చేసిన ఆరు గంటల్లోనే బేగంపేట పోలీసులు ఆ దొంగను పట్టుకుని అరెస్టు చేశారు. మహారాష్ట్ర సరిహద్దులో నిందితుడిని పట్టుకున్నారు. అతనివద్దనుంచి పోలీసులు రూ.46 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే… జూన్ 20-21, 2025 రాత్రి తన గోడౌన్ నుండి గుర్తు తెలియని వ్యక్తి రూ. 46 లక్షలు దొంగిలించాడని పాటిగడ్డలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నుండి పోలీసులకు ఫిర్యాదు అందింది. కార్యాలయం క్యాబిన్ లాకర్లో ఉంచిన నగదు కనిపించకుండా పోయింది. లాకర్ పగిలిపోయి ఉంది. ఈ ఫిర్యాదు ఆధారంగా, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్లు 331(4), 305 కింద ఎఫ్ఐఆర్ నెం. 266/2025 నమోదు చేశారు.
ఈ ఘటన జరిగిన తర్వాత దొంగ సికింద్రాబాద్ నుండి మధ్యప్రదేశ్‌లోని పురెలికి బస్సులో పారిపోతున్నాడని పోలీసులు గుర్తించారు. అనుమానితుడి ఫోటోలు, వివరాలను బస్ స్టాండ్లు, డిపోలు, పోలీస్ స్టేషన్లకు పంపించారు.
అదేసమయంలో మేడ్చల్‌లోని ఒక ధాబా యజమాని సెల్ ఫోన్ నుండి నిందితుడు కాల్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. వారు CCTV ఫుటేజ్ ద్వారా అతనిని ట్రాక్ చేసి, అతను ప్రయాణిస్తున్న బస్సు లోని డ్రైవర్ సహాయంతో అతని కదలికలను నిశితంగా గమనించారు.
తర్వాత, ఆదిలాబాద్ పోలీసుల సహాయంతో మహారాష్ట్ర సరిహద్దులో నిందితుడిని పోలీసులు పట్టుకోగలిగారు. దొంగిలించిన మొత్తం రూ. 46 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మొత్తం ఆపరేషన్ ఆరు గంటల్లో ముగిసింది.
నిందితుడిని మధ్యప్రదేశ్‌లోని పురేలి గ్రామానికి చెందిన 28 ఏళ్ల గిరిధరి సింగ్‌గా గుర్తించారు. అతను ఫిర్యాదుదారుడి కంపెనీలో మూడు సంవత్సరాలు పాటు ఉద్యోగిగా పనిచేసాడు. ఆరు నెలల క్రితం, సింగ్‌ను అనుచిత ప్రవర్తన కారణంగా ఉద్యోగ బాధ్యతలనుంచి తప్పించారు. కాగా, సింగ్ ఉద్యోగిగా ఉన్న సమయంలో, తన యజమాని డబ్బును ఎక్కడ దాస్తాడో తెలుసుకొని దొంగిలించాలని నిర్ణయించుకున్నానని నేరం ఒప్పుకున్నాడు.