ముంబై: భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో హిందూ పండుగల సందర్భంగా శాకాహారం తినడం క్రమంగా ఒక ఆనవాయితీగా మారింది. తాజాగా పండరీపూర్ యాత్ర సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు మాంసం అమ్మకాలను నిషేధించింది…యాదృశ్చికమైన విషయం ఏంటంటే ఇదికూడా బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కావడం గమనార్హం.
ఈ సందర్భంగా మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జయకుమార్ గోర్ పండరీపూర్ పట్టణంతో సహా సోలాపూర్ జిల్లాలో 10 రోజుల పాటు – ఆషాడి ఏకాదశికి ఏడు రోజుల ముందు నుండి పండరీపూర్ ఆలయానికి యాత్రికుల పాదయాత్ర ముగింపు తర్వాత మూడు రోజుల వరకు – మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని ఆదేశించారు.
గోర్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రభాగ నది ఒడ్డున ఉన్న పండరీపూర్ ఆలయాన్ని సందర్శించే యాత్రికుల డిమాండ్ల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. “ఈ కాలంలో మాంసం అమ్మకాలను నిషేధించాలని అనేక మంది వార్కారీలు (యాత్రికులు) ముఖ్యమంత్రి (దేవేంద్ర ఫడ్నవిస్) కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టర్ నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు” అని గోరే అన్నారు. ఈ కాలంలో జిల్లాలో మద్యం అమ్మకాలపై పూర్తి నిషేధం ప్రకటించారు. రాబోయే రోజుల్లో యాత్రికులు ప్రయాణించాల్సిన ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి నిర్ణయాలు అమలవుతాయి.
13వ శతాబ్దంలో సంత్ జ్ఞానేశ్వర్, సంత్ తుకారాం వంటి సాధువులు ప్రారంభించిన పండరీపూర్ పాద యాత్ర చేసే సంప్రదాయం కుల వ్యతిరేక తత్వంలో లోతుగా పాతుకుపోయింది. ఈ సామాజిక-మత ఉద్యమంలో, సంత్ తుకారాం బోధనలు, ముఖ్యంగా, కుల ఆధారిత వివక్షతను సవాలు చేశాయి. 13 నుండి 18వ శతాబ్దాల వరకు విస్తరించి, మహారాష్ట్ర పునరుజ్జీవన కాలం… సుధార్ణ అని కూడా పిలిచే సాధు-కవి ఉద్యమం తరువాత 19, 20వ శతాబ్దాలలో భక్తి ఉద్యమ సాధువుల బోధనల ఆధారంగా అనేక మంది కుల వ్యతిరేక నాయకులచే పునరుద్ధరించారు..
అయితే, గత కొన్ని సంవత్సరాలుగా, బిజెపి, వివిధ మితవాద సమూహాలు ఈ వ్యవస్థీకృత శాఖపై ఆసక్తిని పెంచుతున్నాయి, దీనికి హిందూత్వ భావజాలాన్ని నింపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. వార్కారీలు అని పిలువబడే వారిలో పాల్గొనేవారు ఎక్కువగా బహుజన కులాలు, మాంసం తినే వర్గాలకు చెందినవారు ఎక్కువగా ఉండటం గమనార్హం.
తీర్థయాత్ర సమయంలో వార్కారీలు మాంసం తినరు. అయితే ఇతర గ్రామస్తులు మాంసం తినడంలో వచ్చిన సమస్య ఏమిటో అర్థం కాదు. ఇటీవలి సంవత్సరాలలో, ముఖ్యంగా మహారాష్ట్రలోని బిజెపి ప్రభుత్వ హయాంలో, అనేక మితవాద సమూహాలు వార్షిక పండుగ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మాంసం నిషేధం కోసం పట్టుబడుతున్నాయి. తొమ్మిది రోజుల నవరాత్రి, రామనవమి, ఇతర పండుగల చుట్టూ ఇలాంటి ప్రయత్నాలు గతంలో జరిగాయి.
ఈ నెల ప్రారంభంలో, దేశీయ ఆవుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మహారాష్ట్ర గోసేవా ఆయోగ్ కమిషన్, అన్ని వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలు (APMCలు) జూన్ 3 నుండి జూన్ 8 వరకు, సాధారణంగా బక్రీద్‌కు ముందు, తరువాత ఎటువంటి పశువుల సంత నిర్వహించకూడదని ఆదేశించింది. అయితే ప్రభుత్వ తీర్మానం ద్వారా తీసుకున్న ఈ నిర్ణయం చివరికి ఉపసంహరించుకున్నారు.