గాజా: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణతో యుద్ధం ఆగిపోయింది. అయితే రక్తపిపాసి ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనియన్లను చంపటం ఆపలేదు. తన దేశంపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించగానే మానవత్వం ఎక్కడుంది అంటూ గగ్గోలు పెట్టిన ఇజ్రాయెల్… గాజా ప్రజలపై మాత్రం వైమానిక దాడులతో విరుచుకు పడుతోంది. ఆహారం కోసం వేచి ఉన్న ప్రజలను విచక్షణరహితంగా చంపేస్తోంది.
మధ్య గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 18 మంది మరణించారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గడచిన 24 గంటల్లో 90 మంది మృతి చెందినట్లు గాజా ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇజ్రాయిల్ గాజాతోనే కాకుండా పొరుగు దేశాలను కూడా ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తోంది. తాజాగా వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లాకు ఈశాన్యంగా ఉన్న కాఫర్ మాలెక్‌పై జరిపిన దాడిలో ముగ్గురు మృతి చెందారు.
మానవీయ సహాయాన్ని సాధారణ పౌరులకు పంచుతున్న ప్రదేశంపై ఈ పాశవిక దాడి జరిగిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మానవీయ సాయం కోసం బారులు తీరిన అన్నార్తులపై దాడి చేసి అంతమొందించడం ఇజ్రాయెలీ బలగాలకు పరిపాటిగా మారింది.
గాజా ప్రాంతానికి అంతర్జాతీయ మానవీయ సాయం, ముఖ్యంగా ఆహారం అందకుండా రెండున్నర నెలల పాటు అడ్డుకున్న ఇజ్రాయెల్ గత మే నుంచి అతి కొద్ది పరిమాణంలో గాజాలోకి సాయం అనుమతిస్తోంది. తాజా ఘటనలో మృతి చెందిన వారంతా యువకులేనని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. మృతుల్లో ఒక బాలుడు కూడా ఉన్నట్టు తెలియజేశారు.