సంగారెడ్డి: పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్‌లో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 34కి పెరిగిందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
శిథిలాలు తొలగిస్తున్న క్రమంలో అనేక మృతదేహాలు బయటపడ్డాయి. మొత్తం 31 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. “రక్షణ చర్యలో చివరి దశ ఇంకా కొనసాగుతోంది” అని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పరితోష్ పంకజ్ పిటిఐకి తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ప్రమాద స్థలాన్ని సందర్శిస్తారని ఆరోగ్య మంత్రి సి దామోదర్ రాజనరసింహ తెలిపారు. నిన్న జరిగిన ఈ ఘోర ప్రమాదం రసాయన చర్య వల్ల సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఎపిఐలు), ఇంటర్మీడియట్స్, ఎక్సిపియెంట్స్, విటమిన్-మినరల్ బ్లెండ్స్ మరియు ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్ (ఓ అండ్ ఎం) సేవలలో అగ్రగామిగా ఉన్న ఔషధ సంస్థ అని కంపెనీ వెబ్‌సైట్ తెలిపింది.
కాగా, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం భారీ పేలుడు సంభవించి కార్మికులు, సిబ్బంది మృత్యువాత పడ్డారు. పేలుడు ధాటికి వంద మీటర్ల మేర మంటలు ఎగిసి పడగా, మూడు అంతస్థుల భవనం కుప్పకూలి మృ తుల సంఖ్య పెరిగింది.
మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటైన సిగాచి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ, మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్‌ను తయారు చేస్తుంది. కాగా సోమవారం ఉదయం షిఫ్ట్‌కు 118 మంది కార్మికులు డ్యూటీకి వచ్చారు. వీరితోపాటు అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది 32 మంది, సెక్యూరిటీ సిబ్బంది ముగ్గురు డ్యూటీలో ఉన్నారు. అందరూ విధుల్లో ఉండగా ఒక్కసారిగా భారీ విస్ఫోటనం జరిగింది. కంపెనీలో రియాక్టర్లు పేలడంతో వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానాలున్నాయి. రియాక్టర్ల పేలుడు ధాటికి కంపెనీలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కంపెనీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో పాటు పక్కనే ఉన్న మూడంతస్థుల అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకూలింది.