హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు ఏడాదిలో కనీసం ఒక నెల అయినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వారి సామాజిక విధిలో భాగంగా సమయం ఇవ్వాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి తాను పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, పేద ప్రజలకు ఉచిత, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ అందించడమే తన లక్ష్యమని అన్నారు. పేదలకు సేవ చేయడానికి కొంత సమయం కేటాయించడం ద్వారా వైద్యులు ఈ లక్ష్యాన్ని విజయవంతం చేయడంలో ప్రభుత్వానికి సహాయపడతారని ఆయన విశ్వసిస్తున్నారు.
సంవత్సరంలో “11 నెలలు మీకు నచ్చిన ఆసుపత్రిలో పనిచేయండి. కానీ, ఒక్క నెల అయినా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించండి. ఇది ఒక సామాజిక బాధ్యత. ఖరీదైన వైద్య సంరక్షణ పొందలేని ప్రజలకు ఈ పద్ధతి ద్వారా వైద్యులు సేవ చేసినప్పుడు అసలైన ఉద్యోగ సంతృప్తి కలుగుతుందని” సీఎం పేర్కొన్నారు.
ఈ అభ్యర్థన కేవలం తెలంగాణ, హైదరాబాద్‌లోని వైద్యులకు మాత్రమే ఇది పరిమితం కాదు, విదేశాలలో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన వైద్యులకు సేవలందించవచ్చు. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల నుంచి చాలామంది వైద్యులు భారతదేశానికి వచ్చినప్పుడు సేవలందించాలని కోరుకుంటారు, కానీ వారికి సరైన వేదిక లేదు. ఈ క్రమంలో విదేశాలలోని వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రులలో తమ సేవలను అందించేలా ప్రత్యేక వేదికను ఏర్పాటుచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు.