హైదరాబాద్: ఇస్లామిక్ క్యాలెండర్‌లోని మొదటి నెల అయిన ముహర్రం 10వ రోజున ప్రవక్త ముహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ బలిదానం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో షియా ముస్లింలు అషురా ఊరేగింపును నిర్వహించింది. బీబీ కా అలం ఊరేగింపు డబీర్‌పురా నుంచి మొదలైంది. అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌస్, పంజేశా, మీర్ ఆలం మండి, పత్తర్‌గట్టి, మదీనా, దారుల్‌షిఫా మీదుగా ఊరేగింపు సాగి చివరకు చాదర్‌ఘాట్ వద్ద ముగిసింది.
బీబీ కా ఆలం’ అనేది ఓ చెక్క ముక్క. ఈ చెక్కపైనే ప్రవక్త కుమార్తె బీబీ ఫాతిమా జెహ్రాకు అంతిమ స్నానం చేయించారని నమ్ముతారు. ఈ చెక్క ముక్కను 430 సంవత్సరాల క్రితం కుతుబ్ షాహి రాజవంశం సమయంలో తీసుకొచ్చి ప్రతిష్టించారు. కర్ణాటక నుండి తీసుకువచ్చిన ఏనుగుపై ‘బీబీ కా ఆలం’ను ఊరేగించారు..
కర్ణాటకకు చెందిన ఏనుగు లక్ష్మి, ఐకానిక్ బీబీ కా ఆలంను మోస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఏనుగు మొరాయించడంతో రెండు చోట్ల 10 నిమిషాలు ఈ ఊరేగింపు ఆగిపోయింది. ఏనుగు వెనక్కి తిరిగి బీబీ కా అలావా వైపు వెళ్లడానికి ప్రయత్నించింది. తర్వాత నిర్వాహకులు దానిని శాంతింపజేశారు. తరువాత ఏనుగు యాకుత్‌పురా వైపు కదిలింది. కాగా, ఏనుగు లక్ష్మి బీబీకా ఆలం ఊరేగింపులో పాల్గొనడం ఇదే మొదటిసారి.
యాకుత్‌పురా రోడ్డులోని రాయల్ మ్యాట్ సెంటర్‌లో, ఏనుగు కొంచెం వేగంగా కదిలి, ప్రజల్లో భయాందోళనలు సృష్టించింది. AIMIM MLC, రియాజ్ ఉల్ ఎఫ్ఫాండి, ఒక సమయంలో, ఏనుగు చెదిరిపోతుండటంతో దానికి దూరంగా ఉండాలని ‘మఠందార్‌లను’ అభ్యర్థించారు.
పోలీసులు అర డజను DCM వాహనాలను ఏర్పాటు చేసి, ఏనుగు ఇబ్బంది పెడుతూనే ఉంటే బీబీ కా ఆలంను వాహనంలోకి మార్చడానికి ఊరేగింపు మార్గంలోనే ఉన్నారు.
‘యా హుస్సేన్’ నినాదాలు, ‘మర్సియా’,‘నోహా-ఖ్వానీ’ (దుఃఖాన్ని వ్యక్తపరిచే కవితలు) పఠనాల మధ్య, షియా యువకులు కత్తులు, బ్లేడ్‌లతో కూడిన గొలుసులు, ఇతర పదునైన ఆయుధాలను ఉపయోగించి, అమరవీరుల బాధలకు సంఘీభావం తెలిపేందుకు తమను తాము గాయపరచుకున్నారు. మరికొందరు ఏడుస్తూ, ఛాతీపై కొట్టుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.
ముహర్రం ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు హైదరాబాద్ నగర పోలీసులు హైదరాబాద్ అంతటా 3,000 మంది సిబ్బందిని మోహరించారు. ఊరేగింపు మార్గాన్ని కవర్ చేయడానికి ఆరు డ్రోన్‌లను ఉపయోగించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఒక ప్రత్యేక బృందం ఊరేగింపును పర్యవేక్షించింది.