హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు చేపట్టిన దోస్ కౌన్సెలింగ్ ముగిసింది. అయితే ఆశించిన స్థాయిలో సీట్లు నిండలేదు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, 60 కి పైగా డిగ్రీ కళాశాలలు సున్నా అడ్మిషన్లను నమోదు చేశాయి. జూలై 5న కళాశాలల కన్ఫర్మేషన్ ఎంపికతో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) 2025 వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి.
తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) వెల్లడించిన DOST 2025 అడ్మిషన్ల వివరాలను పరిశీలించినప్పుడు ఈ దారుణమైన గణాంకాలు తెలిసాయి. ఒక ప్రభుత్వ కాలేజీతో సహా 64 డిగ్రీ కళాశాలలు ఈ విద్యా సంవత్సరానికి ఒక్క విద్యార్థిని కూడా ఆకర్షించడంలో విఫలమయ్యాయని వెల్లడైంది. అయితే ఈ కళాశాలల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవే కావడం గమనార్హం. ఈ కళాశాలల్లో మొత్తం 20,260 సీట్లు మిగిలిపోయాయి.
సున్నా అడ్మిషన్లు సాధించిన కళాశాలల్లో అత్యధికంగా 22 కాలేజీలు కాకతీయ విశ్వవిద్యాలయం కింద ఉన్నాయి, తరువాత మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిథిలో 14 కాలేజీల్లో పిల్లలు చేరలేదు. ఇక దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటైన ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిథిలోని 13 కళాశాలలు సున్నా అడ్మిషన్లు పొందాయి. పాలమూరు విశ్వవిద్యాలయం కింద ఐదు కళాశాలలు, అదేవిధంగా, శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఒక ప్రభుత్వ, ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక్క అడ్మిషన్ కూడా లభించలేదు.
మొత్తం మీద, వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ మూడు రౌండ్ల తర్వాత, 4,36,927 సీట్లలో 1,43,037 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి, ప్రభుత్వ, విశ్వవిద్యాలయ, ప్రైవేట్ కళాశాలలతో సహా 957 డిగ్రీ కళాశాలల్లో 2,93,890 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
విశ్వవిద్యాలయాల వారీగా ప్రవేశాల విషయానికొస్తే, చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాలలు 1,95,397 సీట్లలో 34 శాతం ప్రవేశాలను మాత్రమే పొందాయి. అదేవిధంగా, కాకతీయ విశ్వవిద్యాలయ కళాశాలలు మొత్తం 1,07,080 సీట్లలో 31 శాతం ప్రవేశాలను మాత్రమే పొందాయి. ఆసక్తికరంగా ఈసారి, DOST ప్రవేశ ప్రక్రియలోకి ప్రవేశించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ 120 సీట్లలో ఏడు అడ్మిషన్లను మాత్రమే పొందింది.
ఇదిలా ఉండగా తెలంగాణ ఉన్నత విద్యామండలి-TGCHE, కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ DOST ఇంట్రా-కాలేజీ దశ ప్రవేశాన్ని ప్రకటించాయి. ఒకే కళాశాలలో తమ ప్రోగ్రామ్‌ను మార్చుకోవాలనుకునే విద్యార్థులు వెబ్ ఆప్షన్లలో పాల్గొనవచ్చు, ఇది జూలై 9-10 తేదీలలో అందుబాటులో ఉంటుంది. సీట్లు జూలై 11న కేటాయిస్తారు. వెబ్ కౌన్సెలింగ్ మొదటి, రెండవ, మూడవ దశలలో కేటాయించిన సీట్లను ఒకే చేసిన అభ్యర్థులు ఇంట్రా-ఫేజ్ కౌన్సెలింగ్‌కు అర్హులు.