న్యూఢిల్లీ: కోటి కలలతో కళాశాలల్లో చేరే విద్యార్ధులను ‘ర్యాగింగ్’ పేరుతో సీనియర్లు పైశాచికత్వాన్ని. ప్రదర్శిస్తూ అమాయక విద్యార్థుల వినాశనానికి కారణమవుతున్నారు. ర్యాగింగ్ దుష్ట స౦స్కృతి కారణంగా ఏటా ఎందరో విద్యార్థులు తమ చదువులకు స్వస్తి చెబుతున్నారు. ఈ క్రమంలో సీనియర్లు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఫ్రెషర్ల నుండి ప్రతి సంవత్సరం యూజీసీకి డజన్ల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో యూజీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.
జూనియర్లను వేధించడానికి తయారైన ఏదైనా అనధికారిక వాట్సాప్ గ్రూపులను పర్యవేక్షించాలని విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించింది, దీనిని ర్యాగింగ్‌గా పరిగణిస్తామని, ర్యాగింగ్ నిరోధక నిబంధనల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
“అనేక సందర్భాల్లో, సీనియర్లు అనధికారిక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేస్తారు, తద్వారా జూనియర్లను మానసికంగా వేధిస్తారు. ఇది కూడా ర్యాగింగ్‌తో సమానం. దీనికి క్రమశిక్షణా చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని యుజిసి తన తాజా ఆదేశంలో పేర్కొంది.
“క్యాంపస్‌లో విద్యార్థుల భద్రత చాలా ముఖ్యమైనది. ర్యాగింగ్ నిరోధక నిబంధనలను అమలు చేయడంలో విఫలమైతే గ్రాంట్లను నిలిపివేయడం వంటి కఠినమైన చర్యలకు దారితీయవచ్చు” అని యూజీసీ హెచ్చరించింది.
సీనియర్ల సూచనలను పాటించకపోతే జూనియర్లను సామాజిక బహిష్కరణకు గురిచేసిన సంఘటనలను కూడా ఇక్కడ ప్రస్తావించారు.
విద్యార్థులను జుట్టు కత్తిరించుకోవాలని, ఎక్కువ గంటలు మేల్కొని ఉండేలా చేయడం, మాటలతో అవమానించడం వంటి చర్యలకు పాల్పడటం యాంటీ ర్యాగింగ్ రెగ్యులేషన్స్‌ను ఉల్లంఘించడమేనని యూజీసీ తెలిపింది.
ఈ పరిస్థితుల్లో ర్యాగింగ్‌కు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే, విద్యార్థులు తమ కళాశాల లేదా విశ్వవిద్యాలయ అధికారులకు లేదా యాంటీ-ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు.