న్యూఢిల్లీ: భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంపెనీకి అనుమతి లభించింది. భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ (IN-SPACe) నుండి తుది అనుమతి పొందిన తర్వాత, స్టార్‌లింక్ దేశంలో వాణిజ్యపరంగా సేవలను ప్రారంభించనుంది.
ఈ అనుమతి పొందిన తేదీ (జూలై 8) నుండి ఐదు సంవత్సరాల కాలానికి లేదా Gen1 కాన్‌స్టేలేషన్ కార్యాచరణ జీవితకాలం ముగిసే వరకు (ఏది ముందుగా వస్తే అది) చెల్లుబాటు అయ్యేలా ఈ ఒప్పందం చేసుకున్నారు. స్టార్ లింక్ ద్వారా భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా హై-స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్‌ను అందించవచ్చు.
కాగా, స్టార్‌లింక్ సేవలు నిర్దేశించిన నియంత్రణ నిబంధనలు, సంబంధిత ప్రభుత్వ విభాగాల నుండి అవసరమైన అనుమతులు, ఆమోదాలు, లైసెన్స్‌లకు లోబడి ఉంటుంది.
స్టార్‌లింక్ Gen1 అనేది 4,408 ఉపగ్రహాలతో కూడిన ఒక గ్లోబల్ కాన్స్టెలేషన్. ఈ ఉపగ్రహాలు భూమి చుట్టూ 540, 570 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తాయి. ఈ ఉపగ్రహాలు అంతరిక్షంలో ఒక నెట్‌వర్క్‌ను ఏర్పరుస్తాయి, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించడానికి వీలవుతుంది.
కాగా, దేశంలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి స్టార్‌లింక్ సంస్థ 2022 నుండి ప్రయత్నిస్తోంది. గత నెలలో, భారతదేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం నుండి లైసెన్స్ పొందిన మూడవ కంపెనీగా స్టార్‌లింక్ నిలిచింది.
అయితే, లైసెన్స్ పొందిన కంపెనీలు ఒక సంవత్సరం వేచి ఉండాలి. వాణిజ్య శాట్‌కామ్ స్పెక్ట్రం విషయంలో ఇంకా కొంత సమయం పట్టవచ్చు ఎందుకంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవలే ధర, నిబంధనలు మరియు షరతులపై తన సిఫార్సులను ప్రభుత్వానికి పంపింది.రేడియో-వేవ్ ఫ్రీక్వెన్సీల కేటాయింపు తర్వాత ఆయా సంస్థలు తమ సేవలను ప్రారంభించవచ్చు.
సాధారణంగా, వాణిజ్య స్పెక్ట్రంకు ముందే, ట్రయల్ స్పెక్ట్రం అన్ని నిబంధనలు, అవసరాలు పాటిస్తున్నాయని నిరూపించడానికి అన్ని ప్రక్రియలను పరీక్షించి ధృవీకరించాల్సి ఉంటుంది.
అసలేంటీ ఈ స్టార్‌లింక్
ప్రపంచ కుబేరుడు, ఎలాన్ మస్క్ 2002లో స్థాపించిన కంపెనీ స్టార్ లింక్…ఇంటింటికీ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అందేంచేందుకు ఈ స్టార్ లింక్‌ను రూపొందించారు. ఎలన్ మస్క్ స్టార్‌లింక్ ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాలను ఉపయోగించి హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. సాధారణ ఇంటర్నెట్ పద్ధతులతో పోలిస్తే ఉపగ్రహ ఇంటర్నెట్ ద్వారా హై స్పీడ్ డేటా ప్రొవైడ్ చేయవచ్చు. శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా నేరుగా ఉపగ్రహాలకు కనెక్ట్ అయ్యుంటాయి, కాబట్టి హై స్పీడ్ డేటా లభిస్తుంది.
సుదూర భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడే సాంప్రదాయ ఉపగ్రహ సేవల మాదిరిగా కాకుండా, స్టార్‌లింక్ ప్రపంచంలోనే అతిపెద్ద లో-ఎర్త్ ఆర్బిట్ లేదా LEO కాన్స్టెలేషన్ (భూమికి 550 కి.మీ)ను ఉపయోగిస్తుంది.
ఇటీవల, స్టార్‌లింక్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, మిట్టల్‌కు చెందిన భారతీ ఎయిర్‌టెల్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది, ఇవి భారతదేశ టెలికాం మార్కెట్ 70 శాతం కంటే ఎక్కువ నియంత్రిస్తాయి.