ఈమధ్య దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా భక్తి వరదలై పారుతూ కనిపిస్తోంది..రోజు రోజుకూ కొత్త కొత్త పండుగలు పుట్టుకొస్తున్నాయి. గతంలో కేవలం ఉత్తర భారతంలోనే ఎక్కువగా జరుపుకునే గణపతి నవరాత్రులు ఇప్పుడు గల్లీ గల్లీకి విస్తరించాయి. అలాగే అయ్యప్పమాల వేసేవారు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయారు. భక్తి పేరిట వేలు లక్షలు ఖర్చుపెట్టడం అతి సాధారణం అయిపోయింది. పోనీ ఆ తర్వాత జీవితంలో విలువలకు కట్టుబడి ఉంటున్నారా అంటే అదీలేదు. దేనిదారి దానిదే. అత్యంత క్రైమ్ రేట్ కలిగిన దేశాల్లో ఎప్పుడూ మన దేశం ముందు వరుసలోనే ఉంటుంది.
మరి ప్రపంచంలో ఎక్కడాలేనన్ని పూజలు, వ్రతాలు చేసే దేశంలో కొన్నైనా విలువలతో బ్రతకాలి కదా. అదేం ఉండదు. భక్తి అనేదాన్ని ఒక వేషధారణగా, స్టేటస్ సింబల్ గా మార్చాక విచక్షణకు తావుండదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోలోమని వెళ్ళిపోవటమే.
మతాధికారులు వాళ్ళ అవసరాల కోసం భక్తిని నిత్య జీవితంలో భాగంగా మారిస్తే, బీజేపీ లాంటి పార్టీలు దాన్ని దేశభక్తితో ముడిపెట్టి ప్రజల విచక్షణా జ్ఞానాన్ని చంపేసాయి. దాని ఫలితంగా వాళ్లకు అధికారం దక్కితే, దేశ ఆర్ధిక ప్రగతి అట్టడుగుకు పడిపోయింది. బడుగులపై పన్నులు.., ఆదానీ,అంబానీ వంటి బడాబాబులకు వేలకోట్ల రుణ మాఫీలు..తిరిగి పార్టీ ఫండ్ రూపంలో అది బీజేపీ ఖజానాకు చేరటం.
పైకి ఎక్కడా అవినీతి చేస్తున్నట్టు బీజేపీ కనిపించదు, కానీ దేశంలోనే అత్యంత ధనిక పార్టీ మాత్రం అవుతుంది..దేశభక్తి ముసుగులో కూరుకుపోయిన మన మెదళ్లకు ఆ విషయం చేరదు. మనకు ప్రతీ ఎలక్షన్ల ముందు ఒక సర్జికల్ స్ట్రైక్ జరిగితే చాలు.
మరోవంక దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికం, అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటున్న చోటే ఆకలిచావులు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా సరైన పౌష్టికాహారం దొరక్క ప్రతియేటా లక్షల్లో చనిపోయే చిన్నారుల మరణాలు..ఇవన్నీ మనకు అవసరం లేదు..భావోద్వేగాలు రాజ్యమేలేచోట మంచీచెడుల తర్కం పనిచేయదు.
ప్రపంచాన్ని యుద్ధాల్లోకి దింపి, తన అవసరాలకోసం యుద్ధాలను ఆపే అమెరికా ఎక్కడా తన దేశంలో మూఢత్వాన్ని ప్రబలేలా చేయదు, శాస్త్ర విజ్ఞానానికే ప్రాధాన్యత ఇస్తుంది. కానీ మనకు అది అవసరం లేదు. మనకు భక్తి, భావోద్వేగాలే ప్రదానం.
తమ దేశంలో ట్విన్ టవర్లను కూల్చినదానికి ప్రతీకారంగా అమెరికా ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న బిన్ లాడెన్ ను సైలెంట్ గా రాత్రికి రాత్రే మట్టుపెట్టింది. అతడి శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో కలిపేసింది. ఎక్కడా హడావుడి లేదు, ఆరాటం లేదు..ఆ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు ప్రజల ముందుకొచ్చి తన ఆరించుల ఛాతీ ప్రదర్శన చేయలేదు, దాన్ని ఎన్నికల ఎజెండాగా మార్చలేదు. ఆ దేశ ప్రజలు… ఆ విషయం నాలుగు రోజులు మాట్లాడుకున్నారు, వదిలేసారు.
అక్కడి ప్రభుత్వం దేశ సైన్యంతో పాటు సామాన్య జనాన్ని మానసికంగా యుద్ధరంగంలోకి దింపలేదు. సైన్యం వాళ్ళ పని వాళ్ళు చేసారు అంతే.. ఇక్కడ అలా కాదు, సైన్యం బోర్డర్ లో యుద్ధం చేస్తుంటే, తుపాకి లేకుండా మనం మన మనసుల్లో యుద్ధం చేస్తుంటాం. ఇక్కడున్న ప్రతి ముస్లిం పాకిస్తాన్ వాడే అన్నంత ఇదిగా ద్వేషిస్తుంటాం..వీధుల్లో బాణాసంచా పేలుళ్ళు, రోడ్లపై త్రివర్ణ పతాకాల రెపరెపలు..బోర్డర్ లో కంటే ఇక్కడే పెద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తుంది.
కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి కావాల్సింది కూడా అదే. ప్రజల భావోద్వేగాలే వాళ్ళ అధికారానికి పెట్టుబడి..దేశ రక్షణ కోసం ఆర్మీ చేసేవి త్యాగాలే. కానీ వాటిని రాజకీయపార్టీలు క్యాష్ చేసుకోవడం విధి వైచిత్రి.
సాధారణంగా ఏ దేశంలోనైనా మెజారిటీ ప్రజల్ని చూసి మైనార్టీలు భయపడతారు. కానీ ఇక్కడ మైనార్టీల వల్ల ప్రమాదం ఉందని మెజారిటీ ప్రజల్ని భయపెడతారు. ఎక్కడో ఎవరో ఆ మతానికి సంబంధించినవాళ్ళు టెర్రరిస్ట్ లతో జతకలిసారని మొత్తంగా ఆ జాతి తప్పుచేసిందని అభాండాలు వేస్తారు. మత మార్పిడులతో మొత్తం హిందూ సమాజాన్ని వాళ్ళవైపు తిప్పుకుంటున్నారని గగ్గోలు పెడతారు. అధిక సంతానంతో వాళ్ళ జనాభా పెంచుకుంటున్నారని నిందలు వేస్తారు. అదే సమయంలో కోట్లమంది హిందువులు కుటుబ నియంత్రణ ఆపరేషన్లు ఏమీ చేసుకోలేదనే సత్యాన్ని విస్మరిస్తారు.
ఎక్కడో ఒకచోట చుక్క తెగిపడ్డట్టు కొందరు ముస్లింలు హిందూ అమ్మాయిలని ప్రేమించి పెళ్లిచేసుకుంటే లవ్ జిహాద్ అంటూ కొట్టి చంపుతారు. అదే మన చుట్టూ ముస్లిం అమ్మాయిలను చేసుకున్నవాళ్లు కనిపిస్తున్నా చూసీ చూడనట్టు నటిస్తుంటారు.
శాస్త్ర విజ్ఞానాన్ని కాకుండా మతాన్ని నమ్ముకున్న ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాలు ఇవ్వాళ ఏ పరిస్థితుల్లో ఉన్నాయో చూస్తున్నాం. షియాలు, సున్నీలంటూ కొట్టుకు చచ్చే ఇరాక్, సిరియా,లెబనాన్, యెమన్, బహరైన్ లాంటి దేశాల అంతర్యుద్ధం కళ్ళముందే కనపడుతోంది. అభివృద్ధిని కాదని అస్థిరమైన నిర్ణయాలతో అతలాకుతలమైన శ్రీలంక ఉదంతం ఒక దేశం ఏం చేయగూడదో నేర్పించింది.
ప్రపంచంలో అత్యంత బలశాలి అనుకునే ఇజ్రాయెల్ పాలస్తీనాను శవాలదిబ్బగా మార్చినా ఇప్పటివరకు సాధించిందేం లేదు. ఉండదు కూడా. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. తనకు ఎదురే లేదనుకున్న ఇజ్రాయెల్ ఇవ్వాళ ఇరాన్ తో చేసిన యుద్ధంలో భంగపడి పరువుకోసం పాకులాడుతోంది.
ఏతావాతా భక్తి, భావోద్వేగాలవల్ల దేశాభివృద్ది లేకపోవటం, దేశప్రగతిలో పాలుపంచుకోవాల్సిన యువత సమయమంతా నిర్వీర్యం అయిపోవటం. పైగా ఎదుటిమతంపై కక్షలు కార్పణ్యాలు పెంచుకోవటం..మనిషికి మనిషికి మధ్య మనమే మతమనే అడ్డుగోడ నిర్మించుకోవటం…. కాబట్టి దేవుడు, మతం అనేవి మన గడప లోపలివరకు ఉన్నప్పుడే వ్యక్తులకైనా దేశాలకైనా శ్రేయస్కరం. అవి గడపదాటి వీధుల్లోకొస్తే మిగిలేది స్మశానమే…!!
-Premraj enumula