జెరూసలెం: గాజాను శవాల దిబ్బగా మార్చినా ఇజ్రాయెల్ రక్త దాహం తీరలేదు. ఆ దేశం పదేపదే పాలస్తీనీయన్ల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా పాలస్తీనా దిగ్బంధిత ఎన్‌క్లేవ్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 66 మంది మరణించారు. చనిపోయిన వారిలో హెల్త్ క్లినిక్ వెలుపల పోషకాహార సప్లిమెంట్ల కోసం క్యూలో నిలబడిన ఎనిమిది మంది పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది.
ఐక్యరాజ్యసమితి పిల్లల సంస్థ ప్రకారం, మరణించిన వారిలో ఒక సంవత్సరం వయస్సు గల బాలుడు కూడా ఉన్నాడు, అతని తల్లి కొన్ని గంటల ముందు తనతో మొదటిసారి మాట్లాడిందని చెప్పింది. తల్లి కూడా తీవ్రంగా గాయపడిందని యునిసెఫ్ పేర్కొంది. అనేక మంది గాయపడినట్లు తెలిపాయి. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నాయి. గాజాలో ఇజ్రాయెల్ ‘అభం శుభం తెలియన’ పిల్లలను చంపడాన్ని యునిసెఫ్ ఖండించింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 2023లో ప్రారంభమైన విషయం తెలిసిందే. 21 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఒత్తిడి చేస్తున్నారు. అయినా చర్చల్లో ఎలాంటి పురోగతీ కనిపించట్లేదు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ రెండు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు భేటీ అయ్యారు. . యుద్ధం ముగింపు, బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందం వంటి అంశాలపై చర్చించారు.
గాజాలో 60 రోజుల కాల్పుల విరమణ : ట్రంప్
గాజా అంశంలో తమ ప్రతినిధులు ఇజ్రాయెల్‌తో సుదీర్ఘ చర్చలు చేపట్టారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపిన విషయం తెలిసిందే. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని, ఆ సమయంలో అన్ని పార్టీలతో కలిసి యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తాం అని అన్నారు. శాంతి ఒప్పందం కోసం ఖతార్, ఈజిప్ట్ తీవ్రంగా ప్రయత్నించాయని, వాళ్లే దీనికి సంబంధించిన తుది ప్రతిపాదన చేస్తారన్నారు. మిడిల్ఈస్ట్ మంచి కోసం హమాస్ ఆ ఒప్పందాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే, గాజాపై యుద్ధాన్ని పూర్తిగా ఆపేస్తామంటేనే ఒప్పందాన్ని అంగీకరిస్తామని హమాస్ సంస్థ తెలిపింది.
మొత్తంగా ఇజ్రాయెల్ జాతి విధ్వంస యుద్ధం కొనసాగుతున్నందున గాజాలో మరణాల సంఖ్య 57,800కి చేరుకుంది. గాజాలో పెద్ద సంఖ్యలో జనాభా నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు.
మరోవైపు ఇజ్రాయెల్‌పై కక్షతో యమన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు పాశ్యాత్య దేశాలకు చెందిన వాణిజ్య నౌకలపై దాడులకు దిగుతున్నారు. తాజాగా గ్రీక్ దేశానికి చెందిన నౌకపై దాడిచేసి దానిని సముద్రంలో ముంచేశారు. కొంత మంది సిబ్బందిని కిడ్నాప్ చేశారు.