టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని తన ఇంట్లో సన్‌బాత్ చేస్తున్నప్పుడు డ్రోన్‌తో దాడి చేసి చంపాలనుకున్నామని ఇరాన్ సుప్రీం లీడర్ మాజీ సలహాదారుడు పేర్కొన్నాడు.
ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదే సమయంలో ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా సైన్యం కూడా పెద్దఎత్తున దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో తమపై దాడులకు ట్రంప్, అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ హెచ్చరించారు.
తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు జావద్ లారీజాని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇకపై ఆయన ఫ్లోరిడా నివాసం కూడా సురక్షితం కాదు. మార్-ఎ-లాగో రిసార్ట్‌లో అధ్యక్షుడు సన్‌బాత్ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ ఆయన్ను ఢీకొట్టవచ్చని హెచ్చరించారు. ఇది చాలా సులభమైన పని అని, వ్యాఖ్యానించారు.
కాగా, 2020లో ఇరానియన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యలో ట్రంప్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ఈ హెచ్చరికలు చేశారు. స్థానిక మీడియాలో ఆయన వ్యాఖ్యలు ప్రసారమయ్యాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇదిలా ఉండగా తనకు వచ్చిన బెదిరింపులపై ట్రంప్ సెటైరికల్‌గా స్పందించారు. దీనికి సంబంధించి పీటర్ డూసీ అనే విలేకరి ట్రంప్‌ను ఉద్దేశించి మీరు చివరిసారిగా సన్‌బాత్‌కు ఎప్పుడు వెళ్లారని అడగ్గా… “చాలా కాలం అయింది. నాకు తెలియదు, బహుశా నేను ఏడు లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో ఉండవచ్చు. నేను రెగ్యులర్‌గా సన్‌బాత్ చేయను” సన్బాత్ తనకు అంతగా ఇష్టం ఉండదని నవ్వుతూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇజ్రాయెల్, ఇరాన్ 12 రోజుల యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుని… ఇరాన్ అణు కేందరాలపై బాంబు దాడి చేసిన రెండు వారాల తర్వాత ఇది జరిగింది. ఈ బాంబు దాడుల ద్వారా ఇరాన్ అణుకేంద్రాలను నిర్మూలించామని ట్రంప్ పదే పదే చెప్పారు. అయితే, కొంతమంది నిపుణులు మాత్రం నష్టం పెద్దగా లేదని, దాడులకు ముందు ఇరాన్ తన శుద్ధి చేసిన యురేనియం నిల్వలను రహస్యంగా తరలించి ఉంటుందని అన్నారు.
ఇరాన్ యురేనియం తరలించలేదని, అణు కేంద్రాలలోనే ఉందని నిఘా వర్గాలు సూచిస్తున్నాయని ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు.
కాగా, ఈ వారం నార్వేలో అమెరికా, ఇరాన్ తమ చర్చలను తిరిగి ప్రారంభిస్తాయి. ఏదో ఒక సమయంలో ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేయాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ అన్నారు, కానీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ టక్కర్ కార్ల్‌సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండు దేశాల మధ్య సంబంధాలలో విశ్వాసం ఒక సమస్యగా ఉంటుందని అన్నారు.
సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అణు కార్యక్రమాన్ని ముగించకపోతే ఇరాన్‌పై మళ్లీ బాంబు దాడి చేస్తానని ట్రంప్ బెదిరించారు.