28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

హైదరాబాద్‌ను వీడని వాన…. ఆగస్టు 1 దాకా వర్షాలే… ‘ఐఎండీ’!

హైదరాబాద్: ఇటు తెలంగాణ.. అటు రాజధాని హైదరాబాద్‌ను వర్షాలు వీడనంటున్నాయి. మొన్నటి వరదలకు మూసీ రాజధాని నగరాన్ని ముంచెత్తింది. వరద ఉద్ధృతి తగ్గుతుంది అనుకునేలోపే నిన్న గంట పాటు  భారీ వర్షం కురిసింది. నగరాన్ని ఆగమాగం చేసి వెళ్లి పోయింది. హైదరాబాద్‌లో మరో మూడు రోజులపాటు అంటే  ఆగస్టు 1వ తేదీ (సోమవారం) వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28 నుంచి 31 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.

హైదరాబాద్ నగరంలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ సూచనల నేపథ్యంలో… వారాంతం కావడంతో అనవసరంగా బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. వర్షం వెలిశాక హడావిడిగా బయటకు వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకోవద్దని చెప్తున్నారు.  ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించారు. వాహనదారులు జాగ్రత్తగా రోడ్లపై వెళ్లాలని, కరెంట్‌ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.

మరోవంక తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల చెరువులకు గండిపడి నీరంతా గ్రామాల్లోకి వచ్చి చేరుతోంది. భారీ వర్షాల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఐతే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇప్పటికే 94 శాతం అధికంగా వర్షాలు పడ్డాయని పేర్కొన్నది వాతావరణ శాఖ. శనివారం పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. రాగల 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది వాతావరణ శాఖ. దీంతో ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles