హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పేదలకు శుభవార్త వినిపించింది. ఓ దశాబ్దం తర్వాత తెలంగాణలో తొలిసారిగా రేషన్ కార్డుల పండుగ జరగనుంది. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో నేడు సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి సీఎం లబ్ధిదారులకు కార్డులను అందించి, అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. సీఎం కార్డులు పంపిణీ చేసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 3.58 లక్షల కార్డులు లబ్ధిదారులకు అందనున్నాయి. ఈమేరకు తిరుమలగిరిలో సన్నద్ధతను సమీక్షించిన పౌర సరఫరాల కమిషనర్ డి ఎస్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. అర్హులైన వారందరినీ ప్రభుత్వం కవర్ చేస్తుందని, ఎవరైనా తప్పిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 5,61,343 కొత్త రేషన్ కార్డులకు 27, 83,346 మంది కొత్త సభ్యులను నమోదు చేసిందని, దీని కోసం ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.1,151 కోట్ల అదనపు ఖర్చు అవుతుందని కమిషనర్ తెలిపారు. ఈ కొత్త కార్డులతో కలిపి తెలంగాణలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95,56,625కు చేరనుండగా.. లబ్ధిదారులు 3 కోట్లు దాటనున్నారు. కాగా, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ జిల్లాలో 3,24,165 రేషన్ కార్డులకు 23,870 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు.