టెహ్రాన్ : ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్‌పై మరోసారి మండిపడ్డారు. ఇజ్రాయెల్ అమెరికా పెంపుడు కుక్క లాగా ఆ దేశం చెప్పినట్టూ ఆడుతోందని విరుచుకుపడ్డారు. దాని సూచనల ప్రకారమే నడుచుకుంటోందని ఆరోపించారు. ఖమేనీ మాట్లాడుతూ…వారు ఏదైనా కొత్త సైనిక దాడికి పాల్పడితే… తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో 12 రోజుల యుద్ధంలో ఇచ్చిన దానికంటే… ప్రత్యర్థులకు ఇంకా పెద్ద దెబ్బ ఇవ్వగలమని అన్నారు.
“మన దేశం అమెరికా శక్తిని, దాని పెంపు కుక్క అయిన ఇజ్రాయెల్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందనే వాస్తవం మమ్మల్ని గర్వపడేలా చేస్తుందని” ఖమేనీ అన్నారు.
గత నెలలో, ఇరాన్ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే అని ఇరాన్ చెప్పినప్పటికీ, అమెరికా…. ఇరాన్ అణు, సైనిక సౌకర్యాలపై దాడులు చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో వందల మంది మరణించారు. ఇజ్రాయెల్ తన వైమానిక దాడులతో ఇరాన్‌లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ ప్రతిగా ఖతార్‌లోని ఒక US స్థావరాలపై మిస్సైల్ దాడులు చేసింది.
ప్రస్తుతం, ఇరాన్ అమెరికాతో అణు ఒప్పందానికి అంగీకరించాల్సిన ఒత్తిడిలో ఉంది, ఎందుకంటే వాషింగ్టన్, మూడు యూరోపియన్ శక్తులు ఈ ఒప్పందం కోసం ఆగస్టు చివరి నాటికి గడువును నిర్ణయించాయి. అప్పటి వరకు ఎటువంటి పురోగతి లేకపోతే…జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద ఎత్తేసిన అన్ని అంతర్జాతీయ ఆంక్షలను “స్నాప్‌బ్యాక్” యంత్రాంగం స్వయంచాలకంగా విధిస్తుందని ఫ్రాన్స్ విదేశాంగమంత్రి అన్నారు.
అయినప్పటికీ, ముందస్తు షరతులు నెరవేరకపోతే టెహ్రాన్ అమెరికాతో అణు చర్చలను తిరిగి ప్రారంభించదని ఇరాన్ పార్లమెంట్ ఒక ప్రకటన చేసింది. “దౌత్య – సైనిక రంగాలలో బలహీనమైన స్థానం నుండి కాకుండా, మనం పూర్తి సామర్థ్యంతో పని చేస్తామని” ఖమేనీ అన్నారు, దౌత్యవేత్తలు “మార్గదర్శకాలను” పాటించి తమ పనిని కొనసాగించాలని ఇరాన్ సుప్రీం లీడర్ సూచించారు.