-మొఘల్ పాలకులను హంతకులుగా చూపించడం దారుణం
-ప్రతి పౌరుడు కేంద్రంలోని అధికార బీజేపీ చర్యను వ్యతిరేకించాలి
-ఎంఎంకే అధినేత, ఎమ్మెల్యే ప్రొఫెసర్ జవాహిరుల్లా డిమాండ్
చెన్నై: చరిత్రను వక్రీకరించి, భారతదేశ భిన్నత్వానికి వ్యతిరేకంగా మత పరమైన వైఖరి కలిగిన కథనాలను పాఠాల ద్వారా పిల్లల్లోకి జొప్పిస్తున్నారని మణితనేయ మక్కల్ కచి (ఎంఎంకే) అధినేత, తమిళనాడుకు చెందిన ఎమ్మెల్యే ప్రొఫెసర్ జవాహిరుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. “ఒక దేశ చరిత్ర దాని ఆత్మను ప్రతిబింబిస్తుంది.. చరిత్రను తారుమారు చేయడమంటే భారతదేశ ప్రాథమిక విలువలకు ఆటంకం కలిగించడమే” అని ఆయన శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ చరిత్ర పాఠ్య పుస్తకాలను మార్చడాన్ని “కుట్ర”గా ఆయన అభివర్ణించారు.
ఇటీవల విడుదలైన విశ్లేషణాత్మక ఎనిమిదో తరగతి సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకం ‘Exploring Society: India and Beyond(సమాజాన్ని అర్థం చేసుకోవడం: ఇండియా, దాని అవతల పరిధిలో)’ ను జవాహిరుల్లా విమర్శిస్తూ, ఇది పాఠ్య పుస్తకంగా కంటే ఎక్కువగా “రాజకీయ ప్రచార పుస్తకం”లా తయారయ్యిందని ఆరోపించారు. ఆ పుస్తకంలో ముస్లిం పాలకులను అనైతిక ప్రతి నాయకులుగా(విలన్లుగా) చూపించడమే కేంద్రం ఉద్దేశమని ఆరోపించారు. “బాబర్, అక్బర్, ఔరంగజేబ్ లను హంతకులుగా చూపిస్తూ చరిత్రను ఒక కట్టు కథలా మార్చేశారు.” అని ఆయన తెలిపారు.
వాస్తవానికి అక్బర్ మత సహనానికి పెద్దపీట వేసిన మొఘల్ చక్రవర్తి అని జవాహిరుల్లా కొనియాడారు. అలాగే, ఔరంగజేబ్ గురించి ఉన్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ, ఆయన హిందూ దేవాలయాలకు అనేక దానాలు ఇచ్చారని చరిత్రను గుర్తు చేశారు. ఉదాహరణకు, ఆరైల్‌లోని సోమేశ్వర్ మహాదేవ్ ఆలయం, ఉజ్జయినిలోని మహా కాళేశ్వర్ ఆలయం, చిత్రకూట్‌లోని బాలాజీ ఆలయం మొదలైన వాటికి ఔరంగజేబ్ నిధులు ఇచ్చారని తెలిపారు.
“ఈ విధమైన నిజాలను చరిత్రలో వదిలేయడం అంటే యువత మనసులను మత పరంగా మలచేందుకు చేసే విషపూరిత ప్రయత్నమే” అని ఆయన హెచ్చరించారు. ఇది దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతను, సామాజిక సౌభ్రాతృత్వాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని చెప్పారు. అంతేగాక బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ లాంటి నాయకులను చరిత్ర పుస్తకం నుండి తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “వారి చరిత్రను తొలగించడం అనేది క్షమించరాని నేరం”గా ఆయన అభివర్ణించారు.
ఎన్సీఈఆర్టీ వంటి గౌరవనీయ విద్యా సంస్థను హిందుత్వ రాజకీయాలకు సాధనంగా మార్చడాన్ని జవాహిరుల్లా తీవ్రంగా ఖండించారు. ఈ పాఠ్య పుస్తకం విద్యా విలువలకే కాకుండా సామాజిక సమగ్రతకూ ప్రమాదంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్ర అనేది ఆధారపూరితమైన, ప్రామాణిక దృష్టితో కూడిన చరిత్రకారుల చేతుల్లో ఉండాలని స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపిత చరిత్రను ప్రచురించడంలో ఎన్సీఈఆర్టీ దూకుడు ప్రదర్శిస్తున్నదని ఆయన విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తుంటే పౌర సమాజం, విద్యావేత్తలు మౌనాన్ని ఉండటాన్ని కూడా ఆయన విమర్శించారు. “ఇది బాధ్యత కలిగిన పౌరుల మౌనం వల్లే జరుగుతోంది” అంటూ జాతీయ స్థాయిలో దీనిపై ప్రతిఘటన అవసరమని పిలుపునిచ్చారు. “ప్రతి పౌరుడూ ఈ కొత్త పాఠ్య పుస్తకాన్ని ఉపసంహరించాలని ధైర్యంగా డిమాండ్ చేయాలి. మన దేశాన్ని రక్షించుకోవడం ఇది మన అందరి బాధ్యత.” అని జవాహిరుల్లా స్పష్టం చేశారు. రాజ్యానికి(ప్రభుత్వానికి) చెందిన సంస్థలపై మతపరమైన ప్రభావాన్ని తొలగించాల్సిన అవసరముందని ఆయన పిలుపునిచ్చారు. ఈ విధమైన అధికార దుర్వినియోగాన్ని నిరసించడం భారతీయుల బాధ్యతని నొక్కి చెప్పారు.
జవాహిరుల్లా చేసిన ఈ వ్యాఖ్యలు, ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో తాజా మార్పులకు వ్యతిరేకంగా పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో వెలువడ్డాయి. చరిత్రను తారుమారు చేస్తూ, భారతదేశ భిన్నత్వాన్ని మార్చే విధంగా పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారని విద్యావేత్తలు, చరిత్రకారులు, ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.
- ముహమ్మద్ ముజాహిద్, 9640622076