న్యూఢిల్లీ: ఆరోగ్య కారణాలను చూపుతూ జగదీప్ ధంఖర్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామాను ప్రకటించడానికి ముందు…తెరవెనుక అనేక చర్యలు కీలక పాత్ర పోషించి ఉండవచ్చు.
హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు కట్టలు దొరికాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తొలగింపుపై ప్రతిపక్ష ఎంపీలు చేసిన తీర్మానాన్ని ఆమోదించాలని ధంఖర్ తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి నచ్చలేదని NDTV మంగళవారం ముందుగా నివేదించింది. అయితే ఈ అంశంపై బీజేపీ నాయకత్వం వహించాలని కోరుకుంది. జస్టిస్ వర్మ తొలగింపు కోసం కేంద్రం ఒక తీర్మానాన్ని సిద్ధం చేసింది, ప్రతిపక్ష ఎంపీల నుండి కూడా సంతకాలను తీసుకుంది. దానిని లోక్‌సభలో ప్రవేశపెట్టాలనుకుంది.
ఈ లోగానే రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న ధంఖర్, తమకు తెలుపకుండానే ప్రతిపక్ష ఎంపీల తీర్మానాన్ని ఆమోదించడం చూసి ప్రభుత్వం పూర్తిగా ఆశ్చర్యపోయింది. ఇలా జరిగిన కొన్ని గంటల్లోనే ధంఖర్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు.
ఈ పరిణామాలు ఆసక్తికరమైన పరిస్థితికి దారితీశాయి, ఆరు నెలల క్రితం ప్రతిపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి, ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ప్రతిపక్ష పార్టీల నుండి మద్దతు పొందుతోంది. అయితే అయినప్పటికీ ప్రభుత్వం తన ఎంపీలకు ఆయన “హద్దు దాటిన” సందర్భాల గురించి తెలియజేసింది.
వేగంగా మారిన పరిణామాలు
జస్టిస్ వర్మపై ప్రతిపక్ష ఎంపీల ప్రతిపాదనను ధంఖర్ అంగీకరించడమే కాకుండా, దాని గురించి ప్రభుత్వానికి తెలుపలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. “ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి ఉంటే, అధికార పార్టీ ఎంపీలు కూడా ఈ తీర్మానంపై సంతకం చేసి ఉండేవారు” అని ఆ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం లోక్‌సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ ప్రణాళికకు విరుద్ధంగా ఉందని, ప్రతిపక్ష ఎంపీలు కూడా దీనిపై చర్చించారని వర్గాలు నొక్కిచెప్పాయి.
న్యాయవ్యవస్థలోని అవినీతిపై ప్రభుత్వం బలమైన వైఖరి తీసుకున్నందున, ధంఖర్ చర్య ఈ అంశంపై తన నాయకత్వాన్ని నీరుగార్చే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం కలత చెందిందని ఆ వర్గాలు తెలిపాయి.
ఉపరాష్ట్రపతి ప్రతిపక్ష తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీనియర్ మంత్రుల సమావేశం జరిగింది. మంత్రులు, మంత్రివర్గంలోని అత్యంత సీనియర్ సభ్యులలో ఒకరైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్యాలయంలో కలిసి కూర్చుని, అధికార పార్టీ రాజ్యసభ ఎంపీలందరినీ అక్కడికి పిలవాలని బిజెపి చీఫ్ విప్‌ను కోరారు.
10 మందితో కూడిన బిజెపి ఎంపీలను పిలిచి, సిద్ధంగా ఉంచిన ఒక ముఖ్యమైన తీర్మానంపై సంతకం చేయమని కోరారు. ఈ బృందాలు వెళ్లిపోయిన తర్వాత, బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏలోని ఇతర సభ్యుల ఎంపీల సంతకాలను కూడా కోరారు.
ఈ తీర్మానం గురించి అన్ని ఎంపీలను నోరు మెదపకుండా ఉండమని, ముఖ్యంగా, దానిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటే వారు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, రాబోయే నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండాలని వారిని కోరారు. ఉపరాష్ట్రపతి ధంఖర్‌కు ఈ తీర్మానం గురించి, ఎంపీలు ఇప్పటికే దానిపై సంతకం చేశారని సమాచారం అందింది.
నష్ట నివారణ చర్యలు
మంగళవారం పొద్దుపోయాక సీనియర్ మంత్రులు ఎంపీలను బీజేపీ అధిష్టానం పిలిచి… 2022లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యే ముందు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న ధన్‌ఖర్ “హద్దు దాటిన” సందర్భాల గురించి వారికి వివరించారని వర్గాలు తెలిపాయి. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించిన లేదా దానికి ఇబ్బంది కలిగించిన సందర్భాల గురించి కూడా ఎంపీలకు సమాచారం అందించారు. దీంతో ఇంకేమీ చేయలేక ధంఖర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆరోగ్య కారణాలు
మంగళవారం రాత్రి 9.25 గంటలకు, ధంఖర్ రాజీనామా ఉపరాష్ట్రపతి X ఖాతాలో పోస్ట్ చేసారు. ధంఖర్ పదవీకాలం ఇంకా రెండేళ్లు మిగిలి ఉంది. ఈ ప్రకటన చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
రాష్ట్రపతికి రాసిన లేఖలో, ధంఖర్ “ఆరోగ్యం దృష్ట్యా వైద్యుల సూచనమేరకు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
ప్రతిచర్యలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి ధంఖర్ రాజీనామాను ఆమోదించారు. ప్రభుత్వంలో చాలా మంది దీనిపై స్పందించనప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధంఖర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
” జగదీప్ ధంఖర్ జీకి భారత ఉపరాష్ట్రపతితో సహా వివిధ హోదాల్లో దేశానికి సేవ చేయడానికి అనేక అవకాశాలు లభించాయి. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని ప్రధానమంత్రి Xలో రాశారు.
మరోవంక ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక ఉన్న కారణాలపై మరింత పారదర్శకత ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
“ఇది ఊహించనిది. ఇలా జరగకూడదు. ధంఖర్ ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే, మధ్యాహ్నం ఏదో జరిగింది. మంత్రులు ఆయన సమావేశానికి రాలేదు. దీనిని ఆయన అవమానంగా భావించి ఉండవచ్చు” అని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ వివేక్ తంఖా చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది. ఉపరాష్ట్రపతి రాజీనామా ఎందుకు చేశారో ప్రభుత్వం స్పష్టం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.సి. వేణుగోపాల్ అన్నారు.
గవర్నర్‌గా ఉన్న సమయంలో ధంఖర్‌తో తరచుగా విభేదాలు ఎదుర్కొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆయనను తీవ్రంగా విమర్శించే వారిలో ఒకరిగా భావిస్తారు. తాను పెద్దగా వ్యాఖ్యానించడానికి ఇష్టపడకపోయినా, మాజీ ఉపరాష్ట్రపతి ఆరోగ్యంగా ఉన్నారని ఆమె అన్నారు.