హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్ చెల్లించాలంటూ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరతీశారు. హైదరాబాద్‌లో 34 ఏళ్ల వ్యక్తి ఈ నకిలీ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రూ.1.72 లక్షలు పోగొట్టుకున్నాడు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రకారం… జూలై 16న బాధితుడికి “RTA CHALLAN.APK” అనే APK ఫైల్ ఉన్న WhatsApp సందేశం వచ్చాక ఈ సంఘటన జరిగింది. ట్రాఫిక్ చలాన్లను తనిఖీ చేయడానికి ఇది నిజమైన అప్లికేషన్ అని నమ్మి, అతను తెలియకుండానే తన వ్యక్తిగత డేటాను నింపి ఫైల్‌ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాడు.
రెండు రోజుల తరువాత, జూలై 18న, బాధితుడు తన HDFC బ్యాంక్ ఖాతా నుండి అనధికారంగా డబ్బు డెబిట్ అవుతున్నట్లు మెసేజ్‌లు వచ్చాయి. అతను వెంటనే లావాదేవీలను ఆపడానికి ప్రయత్నించాడు కానీ తన మొబైల్ ఫోన్ రిమోట్‌గా యాక్సెస్ అయిందని గ్రహించాడు. ఇంకా, అతని నంబర్‌కు వచ్చే అన్ని కాల్లు రహస్యంగా తెలియని నంబర్‌కు ఫార్వార్డ్ అవుతున్నాయి. కాల్ ఫార్వార్డింగ్‌ను నిలిపివేసి, తన ఫోన్‌పై తిరిగి నియంత్రణ సాధించగలిగినప్పటికీ, అప్పటికే అతని ఖాతా నుండి మొత్తం రూ. 1,72,625 కొట్టేశారు.
ఈ ఘటనను బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930)కి నివేదించారు.
దీంతోఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కఠినమైన హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా WhatsApp లేదా SMS ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ APK ఫైల్ల గురించి వస్తున్న మెసేజ్‌లపై జాగ్రత్తలు తీసుకోవాలని పౌరులను కోరింది. WhatsApp, SMS లేదా ఏదైనా తెలియని నంబర్ల ద్వారా వచ్చిన APK ఫైల్‌లను ఇన్స్టాల్ చేయొద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పౌరులకు సలహా ఇచ్చింది. Google Play Store లేదా Apple App Store వంటి విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ప్రత్యేకంగా అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.
అంతేకాదు తెలియని అప్లికేషన్లలో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎప్పుడూ నమోదు చేయవద్దని, అనధికార కాల్ ఫార్వార్డింగ్ కోసం ఫోన్ సెట్టింగ్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. మన అకౌంట్ నుంచి డబ్బు దొంగిలించినట్లు అనుమానం వస్తే, వినియోగదారులు వెంటనే మొబైల్ డేటాను స్విచ్ ఆఫ్ చేసి, వారి బ్యాంకును సంప్రదించాలి.
సైబర్ మోసానికి గురైన బాధితులు సంబంధిత కమ్యూనికేషన్, లావాదేవీల రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. క్రెడిట్ కార్డులకు తప్పకుండా ఓటీపీ ఆప్షను ఎనేబుల్ చేయాలని తెలిపారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే కార్డును బ్లాక్ చేయాలని సూచించారు. అదేవిధంగా సైబర్ నేరాలపై వెంటనే 1930 టోల్పి నంబరు కాల్చేసి ఫిర్యాదు చేయాలని లేదా సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రి 8712672222లో వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.