బెంగళూరు: కర్ణాటకలో జీఎస్‌టీ నోటీసులకు వ్యతిరేకంగా చిరు వ్యాపారులు రేపు బంద్ పాటించనున్నారు. UPI లావాదేవీల డేటా ఆధారంగా దాదాపు 6వేల మందికి GST డిమాండ్ నోటీసులు జారీ చేయడంపై కర్ణాటకలోని వ్యాపారులలో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ విషయంపై వ్యాపారుల సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే ఈ చర్య చట్ట పరిధిలోనే ఉందని ఒక ఉన్నత పన్ను అధికారి పేర్కొన్నారు.
ఆయన PTIతో మాట్లాడుతూ…నోటీసులు తుది పన్ను డిమాండ్లు కాదని, వ్యాపారులు సహాయక పత్రాలతో స్పందించే హక్కు ఉందని వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్ మీరా సురేష్ పండిట్ స్పష్టం చేశారు.
“సమాధానం నమ్మదగినదిగా ఉంటే లేదా GST చట్టం కింద వస్తువులు, సేవలు మినహాయించి ఉన్నట్లైతే, నోటీసులు రద్దు చేస్తామని” ఆమె తెలిపారు.
UPI లావాదేవీల ఆధారంగా వ్యాపారులకు నోటీసులు పంపిన విషయంపై స్పందిస్తూ, రాష్ట్రంలోని అనేక వ్యాపారుల సంఘాలు UPI లావాదేవీలను బహిష్కరించాలని వ్యాపారులకు పిలుపునిచ్చాయి. రేపు సమ్మెకు కూడా పిలుపునిచ్చారు.
జీఎస్‌టీ అధికారులు తమను లక్ష్యంగా చేసుకుని నోటీసులు పంపిస్తున్నారని, జీఎస్‌టీ విభాగం నోటీసులను వెనక్కి తీసుకోకపోతే.. తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని వ్యాపారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక సర్కార్ స్పందించింది. చిరువ్యాపారుల ప్రతినిధులతో చర్చించేందుకు మధ్యాహ్నం 3 గంటలకు తన ఇంట్లోనే సీఎం సిద్ధరామయ్య భేటీ కానున్నారు.
కాగా, 2021 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య జరిగిన యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ ఆధారంగా జీఎస్‌టీ విభాగం ఈ డ్రైవ్ చేపడుతోందని జీఎస్‌టీ ఉన్నతాధికారి పండిట్ వివరించారు.. దీని కింద ఆన్‌లైన్ పేమెంట్ల విలువ రూ. 20లక్షలు (సేవలు), రూ. 40లక్షలు (వస్తువులు) దాటిన వ్యాపారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.
“ఆన్‌లైన్ పేమెంట్ల విలువ సేవలకు గాను రూ. 20 లక్షలు, వస్తువులకు రూ. 40 లక్షలు దాటినప్పుడు, ఆ వ్యాపారి రిజిస్ట్రేషన్ తీసుకొని తన టర్నోవర్‌ను ప్రకటించడానికి జిఎస్‌టి చట్టం కింద నమోదు చేసుకోవడం తప్పనిసరి” అని అధికారి పిటిఐకి తెలిపారు.