గాజా చిన్నారులు ఆకలితో అలమటించి మృత్యువాత పడుతున్నారు. పసి పిల్లల ఆక్రందన చూసినవారెవరికైనా కళ్లు చెమర్చకుండా ఉండవు. మానవత్వం ఏ కోశాన ఉన్నా వాళ్లను ఆదుకోవాలని తపిస్తారు. పలస్తీనాకు ఆనుకుని ఉన్న ఈజిప్టు యువకులు గాజా చిన్నారుల ఆక్రందనలకు చలించి పోయారు. చేతులు కట్టుకుని కూర్చునేకంటే ఏదో ఒకటి చేయాలనుకున్నారు. సీసాలలో బియ్యం పిండి నింపిన సీసాలను సముద్రంలో వదిలేస్తున్నారు. ఎలాగైనా గాజా చిన్నారులకు చేరుతాయన్నది వారి చిన్ని ఆశ.

ఇస్రాయీల్ జరుపుతున్న మారణహోమంతో గాజాలో ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినపడుతున్నాయి. వందల మంది పసి పిల్లలు ఆకలితో మృత్యువాతపడుతున్నారు. గాజాలో 9లక్షల మంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని బీబీసి నివేదిక చెప్పింది. వారిలో 70వేల మంది పోషకాహార లోపంతో ఉన్నారని నివేదికలో పేర్కొంది. ఈ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉందని అంతర్జాతీయ మానవ సేవా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. శిశువులకు పట్టేందుకు పాలు లేక బాలింతల బాధలు వర్ణనాతీతం. మానవతా సాయాన్ని కూడా ఇస్రాయీల్ అడ్డుకుంటోందని పలు స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ”నాలుగు రోజులుగా తినడానికి ఏమీ లేక నా ఇద్దరు పిల్లలు ఏడుస్తున్నారు” అని గాజాకు చెందిన ఓ తండ్రి ఆవేదన.

”కనీసం ఒక పిండి బ్యాగయినా దొరుకుతుందేమోననే ఆశతో ఆహార పంపిణీ కేంద్రం దగ్గరకు వెళ్లాను. కానీ, అక్కడికు వెళ్లేసరికి, ఏం చేయాలో తోచలేదు” అని మరో తండ్రి మీడియా ముందు వాపోయారు.
”గాయపడ్డ వారిని కాపాడాలా? చనిపోయిన వారిని తీసుకెళ్లాలా?లేదా ఆహారం కోసం ఎదురు చూడాలా? దేవుడా, నా పిల్లలు తినేందుకు ఒక పిండి సంచి దొరికినా చాలని ప్రార్థనచేశాను” అని మరో తండ్రి తెలిపారు. ఇప్పటివరకూ యుద్దంలో 59వేల పలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య సంస్థ తెలిపింది.
- ముహమ్మద్ ముజాహిద్, 96406 22076