-ఐదేళ్లలో 785 మంది భర్తలు భార్యల చేతిలో హతమయ్యారు
ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్న విధానం చూస్తే, సామాన్య మనిషి కూడా ఆ అభివృద్ధిలో భాగస్వామి కావడం తధ్యం. మనిషి జీవనశైలి, ఆచార వ్యవహారాలలో ఎంతో పురోభివృద్ధి సాధించాడు. నిన్నటివరకు సైకిల్ పెడల్ తొక్కుతూ ప్రయాణించిన మనిషి ఇప్పుడు పెట్రోల్ లేకుండానే ఎలక్ట్రానిక్ వాహనంపై దూసుకుపోతున్నాడు. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటేనే ఎంతో గర్వంగా భావించేవారం. ఇప్పుడు అభివృద్ధి కలర్ టీవీని ఇంటి గోడలదాకా తీసుకువచ్చింది. అభివృద్ధి మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ తప్ప
ఇప్పటి వరకూ ఇంటిని పాడుచేసిన దుష్ప్రభావం టీవీపై ఉండేది, ఎందుకంటే టీవీలలో ప్రసారమయ్యే అనైతిక సంబంధాల కథలను ఇంటి పెద్దలు తీవ్రంగా నిరసించేవారు. సీరియళ్లలో, సినిమాల్లో వచ్చే కొన్ని అసభ్యకర సన్నివేశాలు వచ్చినప్పుడు టీవీని ఆపేసేవారు. కానీ ఇప్పుడు టీవీ తానే మూసుకుపోయింది. ఇంటి గోడలపై వేలాడుతున్న టీవీలపై ధూళి పేరుకుపోయింది.
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది – పిల్లల దగ్గర నుంచీ పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ తమ ఇష్టమైన కార్యక్రమాలను తమ తమ మొబైల్ ఫోన్లలో చూసుకుంటున్నారు. యువత ఏం చూస్తున్నారు? పిల్లలు ఏం చేస్తున్నారు. యువతులు ఏం చూస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. స్మార్ట్ ఫోన్ మానసిక స్వేచ్ఛను ఇచ్చింది – అది రహస్యంగా అయినా, బహిరంగంగా అయినా.
ఈ స్వేచ్ఛ, వాట్సాప్ మెసేజ్‌లు, సోషల్ మీడియా, చాటింగ్ యాప్‌లు ప్రపంచాన్ని ఒక చిన్న కుగ్రామంలా మార్చేశాయి. ఇన్ స్టా గ్రామ్ ప్రేమలు దేశాల హద్దులు దాటించింది. “ఫలానా ఫారిన్ యువకుడు ఇండియాకు వచ్చి, మన ఊరి అమ్మాయిని భారత సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు” అనే వార్తలు, ఫొటోలతో సహా వార్తాపత్రికల్లో రావడం కొత్తగా ఏమీ కాదు.
కానీ ఇప్పుడు…
గత ఐదేళ్లలో ఐదు రాష్ట్రాల్లో 785 మంది భర్తలను భార్యలు హత్య చేశారు – ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (NCRB) నివేదిక. ఇప్పటి వరకూ స్త్రీలపై జరిగే అఘాయిత్యాల కథలు వినేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ నేరాలలో యువతులు, గృహిణులు కూడా చేరిపోయారు.
ఒక ఉదాహరణ: కొన్ని రోజుల క్రితం సికింద్రాబాద్‌లో 10వ తరగతి విద్యార్థిని తన ప్రేమికుడి సహాయంతో తన తల్లిని హత్య చేయించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి – భార్యలు తమ ప్రేమికుల సహాయంతో లేదా రెంటుకు గూండాలను పెట్టించి భర్తలను హత్య చేయించడం లాంటి వార్తలు మన కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఈ వార్తలు దినపత్రికల్లో ప్రముఖంగా వస్తున్నాయి. సమాజం ఒక కొత్త భయంకర దిశలో సాగిపోతోంది.
“రాత్రి కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు – ఈ రోజుల్లో పట్టపగలే అన్నీ జరుగుతున్నాయి.”
ఈ 785 హత్యలలో అత్యధికంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్రలలో జరిగాయి. నేరాలకు కారణాలు –వ్యాపార లావాదేవీలలో మోసం, అక్రమ సంబంధాలు, ప్రతిష్ఠ సంబంధిత సమస్యలు.
ఈ నివేదికలో పురుషులు కూడా గృహహింసకు బలవుతున్నారనే అంశాన్ని కూడా ఎన్‌సీఆర్‌బీ ప్రస్తావించింది. అభివృద్ధితో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ విప్లవంతో నేరాలు విస్తృతమయ్యాయి.
సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలు ప్రేమగా మారి, ఆ తరువాత సహజీవనం ఆపై వివాదాలు ముదిరి హత్యలకు దారితీస్తున్నాయి. ఈ విషయంలో పురుషులూ, మహిళలూ ఇద్దరూ బాధితులే.
ఒకప్పుడు సినిమా కథల్లో చూసే సంఘటనలు ఇప్పుడు నిజ జీవితంలో జరుగుతున్నాయి. ఉదాహరణకు: ఒక 55 ఏళ్ల వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అతను మద్యపానం చేసి ప్రతి రోజు భార్యను కొట్టేవాడు. అతని ఆత్యాచారాల కారణంగా భార్య చివరకు ఓ రోజు రాత్రి రాళ్లతో అతన్ని కొట్టి హత్య చేసింది – ఆ తరువాత ఆమె స్వయంగా పోలీసులకు లొంగిపోయింది.
ఇలాంటి ఘటనను చూసి మేము బాధపడాలా? సానుభూతి చూపించాలా? అర్థం కావడం లేదు.
గతంలో కొంతమంది పురుషులు భార్యలను కించపరిచేలా ప్రవర్తించేవారు. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేసేవారు. రాత్రి మద్యం సేవించి భార్యలను దారుణంగా హింసించేవారు. అనేక హత్యలు, నేరాల్లో పురుషులే భాగస్వాములయ్యేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. సున్నిత మనస్కులైన స్త్రీలు సైతం హంతకులుగా మారిపోతున్నారు. పతీ, పత్నీ ఔర్ వో లాంటి సీరియళ్లు, సినిమాలు చాలా అందంగా చూపిస్తున్నారు. ఈ సీరియళ్లు, సోషల్ మీడియా ప్రభావం సమాజాన్ని అనాగరికంగా మార్చేస్తుంది.
- ముహమ్మద్ ముజాహిద్, 9640622076