హైదరాబాద్: ఐవీఎఫ్, సరోగసీ క్లినిక్ పేరుతో అక్రమంగా పిల్లలను అమ్ముతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. 64 ఏళ్ల గైనకాలజిస్ట్ డాక్టర్ నమ్రతను, ఆమె సిబ్బందిలోని పలువురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ క్లినిక్‌లో సరోగసీ ద్వారా గర్భం దాల్చిందని చెప్పుకున్న బిడ్డ డీఎన్‌ఏ, దంపతుల నమూనాలతో మ్యాచ్ కాలేదు. దీంతో బాధిత జంట పోలీసులను ఆశ్రయించడంతో నేరం వెలుగులోకి వచ్చింది.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జరిపిన దర్యాప్తులో డాక్టర్ నమ్రత పెద్ద ఎత్తున అక్రమ సరొగసీలు చేస్తున్నట్లు బయటపడింది. అలాగే సరొగసి ముసుగులో పిల్లలను కొనటంతో పాటు అమ్ముతున్నట్లు ఆధారాలు దొరికినట్లు డీసీపీ చెప్పారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటి సెంటర్ పేరుతో సికింద్రాబాద్, కొండాపూర్, కుకట్ పల్లి, విజయవాడ, విశాఖపట్నంలలో అనధికారికంగా అక్రమాలు చేస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.
తమ క్లినిక్కులకు అబార్షన్ల కోసం వచ్చే యువతులతో మాట్లాడి డబ్బులు ఆశచూపించి పిల్లలను కనేట్లుగా ప్రోత్సహించేవారు. పిల్లలు కావాలని వచ్చే దంపతులకు ఐవీఎఫ్ ద్వారా గర్భం సాధ్యంకాదని నచ్చచెప్పి సరొగసి ద్వారా బిడ్డను కనొచ్చని ఒప్పించేవారు. మెడికల్ విషయాలు తెలియవు కాబట్టి దంపతులు డాక్టర్ చెప్పినట్లే వినేవారు. అప్పుడు అబార్షన్ కోసం వచ్చిన యువతులతో మాట్లాడి డబ్బులు బేరం కుదుర్చుకునేవారని పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ నవజాత శిశువులను సరోగసీ ద్వారా గర్భం దాల్చిన పిల్లలుగా మార్చి… క్లయింట్‌లను తమ పిల్లలుగా నమ్మించి తప్పుదారి పట్టించారు.
కాగా, ప్రస్తుత కేసులో… ఏజెంట్ల ద్వారా, శిశువు అసలు తల్లిదండ్రులను గుర్తించారు. వారు అస్సాంకు చెందినవారు. హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. డెలివరీని వైజాగ్‌లో ప్లాన్ చేశారు.
తమ బిడ్డను అమ్మారనే ఆరోపణలపై, అసలు తల్లిదండ్రులను కూడా ట్రాక్ చేసి అరెస్టు చేశారు. డాక్టర్ నమ్రత పిల్లల కోసం వచ్చిన దంపతుల నుండిరూ.35 లక్షల నుండి రూ.40 లక్షల వరకు వసూలు చేసి, అసలు తల్లిదండ్రులకు రూ.90,000 చెల్లించిందని గోపాలపురం పోలీసులు తెలిపారు. అయితే డీఎన్‌ఏ పరీక్షలతో డాక్టర్ నమ్రత బండారం బయటపడింది.
అంతేకాదు హైదరాబాద్, వైజాగ్ క్లినిక్‌లలో ఏకకాలంలో పోలీసులు దాడి చేశారు. అనేక మందిని అరెస్టు చేశారు. వైద్య శాఖ సహాయంతో, గోపాలపురంలోని క్లినిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే ఆస్పత్రిలో డాక్టర్ IVF చికిత్సలు చేస్తున్నారని, సరైన లైసెన్స్ లేకుండా వైద్య ప్రక్రియలు నిర్వహిస్తున్నారని రుజువయింది. నిరసన తెలిపిన ఏ క్లయింట్‌నైనా వృత్తిరీత్యా న్యాయవాది ఆమె కుమారుడు బెదిరించాడు, అతను అదే ప్రాంగణంలో కార్యాలయాన్ని నడుపుతున్నాడు. అతని తల్లి ఆర్థిక లావాదేవీలను నిర్వహించాడు,” అని నార్త్ జోన్ DCP రష్మి పెరుమాళ్ అన్నారు.
ఈ కేసును దర్యాప్తు చేసి, టాస్క్ ఫోర్స్ బృందాలతో కలిసి నార్త్ జోన్ పోలీసుల సంయుక్త బృందం నిందితులను అరెస్టు చేసింది.
ఈ సందర్భంగా నార్త్ జోన్ DCP రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ… ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మోసపూరిత సంతానోత్పత్తి లేదా సరోగసీ సేవల బారిన పడకుండా ఉండాలని కోరారు. భారతీయ చట్టాల ప్రకారం డబ్బును తీసుకొని బిడ్డను కనివ్వడంపై నిషేధం ఉంది. అటువంటి సరోగసీ చికిత్సలను హామీ ఇచ్చే సంస్థలపై పోలీసులకు రిపోర్ట్ చేయమని డీసీపీ అన్నారు. లైసెన్స్ పొందిన,చట్టబద్ధంగా కట్టుబడి ఉన్న వైద్య నిపుణులను మాత్రమే సంప్రదించమని నార్త్‌జోన్ డీసీపీ సూచించారు.