క్రెమ్లిన్: రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి సమీపంలో 8.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. దీనితో పసిఫిక్ మహాసముద్రం సునామీ హెచ్చరిక జారీ చేశారు. రష్యా, జపాన్ తీరప్రాంతాలకు విధ్వంసక సునామీ అలలు చేరుకోవచ్చని యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) తెలిపింది. ఈ హెచ్చరికలు చేసిన కొద్ది సేపటికే జపాన్, రష్యాలను సునామీ తాకింది.
భూకంప కేంద్రం 19.3 కి.మీ (12 మైళ్ళు) లోతులో ఉంది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్‌కు తూర్పు-ఆగ్నేయంగా 125 కి.మీ (80 మైళ్ళు) కేంద్రీకృతమై ఉందని యుఎస్‌జిఎస్ తెలిపింది.
భూకంపం ధాటికి భవనాలు కంపించాయన్న వీడియోలు సోషల్ మీడియాలో వెలువడ్డాయి, అనేక చోట్ల నష్టం వాటిల్లినట్లు వార్తలొస్తున్నాయి. భూకంపం ఈ ప్రాంతాన్ని తాకినప్పుడు నివాస అపార్ట్‌మెంట్‌లోని ఫర్నిచర్ తీవ్రంగా కంపించినట్లు ఒక వీడియోలో చూడవచ్చు.
అలాస్కాతో సహా మిగతా ప్రాంతాలకు అమెరికన్ అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. జపాన్‌లో, వాతావరణ సంస్థ తన సునామీ హెచ్చరికను అప్‌గ్రేడ్ చేసింది, మూడు మీటర్ల (9.8 అడుగులు) వరకు అలలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. జపాన్ పసిఫిక్ తీరం వెంబడి ఉదయం 10:00 నుండి ఉదయం 11:30 (0100-0230 GMT) మధ్య అలలు తాకే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ (JMA) తెలిపింది.
“ఈరోజు భూకంపం తీవ్రమైనది. 2011 తరువాత సంభవించిన అత్యంత బలమైనది” అని కమ్చట్కా గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం…ఎవరికటీ ఎటువంటి గాయాలు కాలేదు. కానీ ఒక కిండర్ గార్టెన్ దెబ్బతిన్నట్లు ఆయన తెలిపారు.
భూకంపం తర్వాత సునామీ ముప్పు కారణంగా ద్వీపకల్పానికి దక్షిణంగా ఉన్న సెవెరో-కురిల్స్క్ అనే చిన్న పట్టణానికి తరలింపు ఉత్తర్వు ప్రకటించబడిందని సఖాలిన్ గవర్నర్ వాలెరీ లిమారెంకో టెలిగ్రామ్‌లో తెలిపారు.
రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ కమ్చట్కా శాఖ టెలిగ్రామ్‌లో 32 సెం.మీ (1 అడుగు) ఎత్తు వరకు సునామీ అలలు తీరాన్ని చేరుకోవచ్చని తెలిపింది. జపాన్ వాతావరణ సంస్థ 0100 GMT నుండి పెద్ద తీర ప్రాంతాలకు 1 మీటర్ (3.3 అడుగులు) వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.
అమెరికా ద్వీప భూభాగం గువామ్, మైక్రోనేషియాలోని ఇతర దీవులకు కూడా సునామీ హెచ్చరిక జారీచేశారు. కమ్చట్కా, రష్యా ఫార్ ఈస్ట్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్నాయి, ఇది భౌగోళికంగా చురుకైన ప్రాంతం. ఇక్కడ తరుచుగా పెద్ద భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.