న్యూఢిల్లీ: రాజ్యసభలో నిన్న ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్‌పై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ… ఖర్గే ప్రభుత్వంపై మాటల దాడికి దిగారు.
భద్రతా వైఫల్యం కారణంగానే పహల్గాం ఉగ్రగాడి ఘటన జరిగిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఖర్గే ప్రశ్నించారు. హోం మంత్రి అమిత్‌షా ఇందుకు బాధ్యత వహించాలన్నారు. దేశంలో టెర్రరిజం నడ్డివిరిగిందని కేంద్రం చెబుతున్నప్పుడు పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఎప్పుడూ గత ప్రభుత్వాలను నిందించే పనిని ఇక ఎంత కాలం కొనసాగిస్తారు?” అని ఖర్గే ప్రశ్నించారు. లెఫ్టినెంట్ గవర్నర్ భద్రతా లోపాన్ని అంగీకరించినట్లయితే, దానిని తక్షణం పరిష్కరించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం పాక్షికంగా వెల్లడించిన విషయాలను ఆయన సవాలు చేస్తూ, ముగ్గురు ఉగ్రవాదుల హత్యకు మించి వివరాలు ఇవ్వాలని కోరారు: “ముగ్గురు చంపేశామని మీరు అంటున్నారు – ఎంతమంది మిగిలి ఉన్నారో, వారిపై ఎప్పుడు చర్య తీసుకుంటారో మాకు చెప్పండి.”
అవమానకరమైన, రెచ్చగొట్టే ప్రకటనలు చేసే వ్యక్తులపై చర్యలు లేకపోవడం గురించి పార్లమెంటు వెలుపల మరియు లోపల పెరుగుతున్న ఆందోళనను ఖర్గే ఎత్తి చూపారు.
ఒక ఉదాహరణను ఉటంకిస్తూ, మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రి ఒక సైనిక అధికారిపై అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారని, వారు దాడిలో పాల్గొన్న మన కుమార్తెల గౌరవాన్ని నాశనం చేశారని ఆయన అన్నారు.
“ప్రతిపక్షం నుండి ఎవరైనా ఇలాంటి భాషను ఉపయోగించినట్లయితే, వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తారు. కాబట్టి బిజెపి అలాంటి సభ్యులను ఎందుకు బహిష్కరించలేదు?” అని సభా నాయకుడు జె.పి. నడ్డాను ఉద్దేశించి ఆయన సభలో ప్రశ్నించారు. “సుప్రీంకోర్టు కూడా ఈ ప్రకటనను ఖండించింది” అని ఆయన అన్నారు.
జాతి సేవలో తన ప్రాణాలను అర్పించిన మేజర్ వినయ్ నర్వాల్ భార్య ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ ఎదుర్కొన్నారని ఆయన మరొక ఉదాహరణను కూడా ఉదహరించారు. విదేశాంగ కార్యదర్శిని కూడా వ్యక్తిగత దుర్వినియోగానికి గురి చేశారు. “ ఈ అవమానకరమైన చర్యలకు ప్రభుత్వం ఎలా స్పందించింది?” అన్న ప్రశ్న మిగిలి ఉందని ఖర్గే అన్నారు.
“దేశభక్తిని ప్రేరేపించే విషయంలో ప్రధాని మోదీ గొప్పలు పోతారు. ఈ విషయంలో ఆయనతో ఎవరూ పోటీ పడలేరు. ఆయన ప్రసంగాలు తరచుగా శక్తివంతమైనవి, ఉత్తేజకరమైనవి. కానీ ఆయన పార్టీలోని సభ్యులు సైన్యాన్ని అగౌరవపరిచినప్పుడు, దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన వారిని ఎగతాళి చేసినప్పుడు – ఆయన మౌనం పాటిస్తారు. ప్రధానమంత్రి ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలి, అలాంటివారిపై చర్య తీసుకోవాలి” అని ఖర్గే అన్నారు.
పహల్గామ్ దాడుల తర్వాత జరిగిన కాల్పుల విరమణ గురించి ప్రస్తావిస్తూ, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి మౌనాన్ని ఖర్గే ప్రశ్నించారు. ఐదు జెట్ విమానాలను కూల్చివేసినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలను ఆయన ప్రస్తావించారు. కాల్పుల విరమణలో మూడవ పక్ష పాత్ర ఉందని సూచించారు.
యుద్ధం ఆపితేనే వాణిజ్య ఒప్పందం ఉంటుందని ట్రంప్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. మీకా అధికారం ఎవరిచ్చారు? వాణిజ్య ఒప్పందం బెదిరింపులకు దేశ ప్రయోజనాలకు తాకట్టు పెడతారా అని ఖర్గే ప్రశ్నించారు.
మునుపటి ఘర్షణలను ప్రస్తావిస్తూ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తండ్రి కె. సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఉన్న కార్గిల్ సమీక్ష కమిటీ తరహాలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
వ్యూహాత్మక, రాజకీయ వైఫల్యాలు ఎక్కడ జరిగాయో గుర్తించడానికి పారదర్శక నివేదిక అవసరమని ఖర్గే వాదించారు. పార్లమెంటరీ బ్రీఫింగ్‌ల ద్వారా కాకుండా మీడియా ద్వారా ఎంపీలు పరిణామాలను తెలుసుకుంటున్నారని ఆయన నిరాశ వ్యక్తం చేశారు.
జాతీయ ఐక్యత మరియు సాయుధ దళాలకు కాంగ్రెస్ మద్దతును ధృవీకరిస్తూ, ప్రభుత్వం సైనిక కార్యకలాపాలను రాజకీయం చేస్తోందని, విపక్షాల లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన ఆరోపించారు.
వ్యూహాత్మక తప్పులకు కాంగ్రెస్‌ను నిందించడం మానేయాలని, వాస్తవాలను ఎదుర్కోవాలని, పూర్తి వివరణ ఇవ్వాలని, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన పార్లమెంటరీ చర్చకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఖర్గే తన వ్యాఖ్యలను ముగించారు.