గాజాలో నివసిస్తున్న ఒక బలహీన తల్లి, తన రెండు నెలల పసి పాప ఆకలితో బాధపడుతున్నదని ప్రపంచానికి విన్నవిస్తూ సహాయం కోరుతోంది. గాజాలోని నాసర్ ఆసుపత్రిలో చేరిన ఆ చిన్నారి తల్లి, బ్రిటిష్ మీడియాతో మాట్లాడుతూ… ప్రపంచ దేశాలన్నీ కలిసి తన బిడ్డను గాజా వెలుపల చికిత్సకు తరలించి ప్రాణాలను కాపాడాలని వేడుకొంటోంది.
యాస్మిన్ అబూ సుల్తాన్ అనే ఆ తల్లి మాట్లాడుతూ… ఇస్రాయీల్ దాడుల వల్ల గాజాలో తీవ్ర కరువు నెలకొంది. “నా బిడ్డ పుట్టినప్పుడు 2.7 కిలోల బరువు ఉండేది. ఇప్పుడు ఆమె బరువు కేవలం 2.6 కిలోలకే పరిమితమైంది,” అని ఆమె చెప్పింది.
“గర్భధారణ సమయంలోనే నేను పోషకాహార కొరతతో బాధపడ్డాను. అందువల్లే నా బిడ్డ కూడా బలహీనంగా పుట్టింది. నా దగ్గర ఆమెకు తినిపించడానికి ఏమీ లేదు — పాలూ లేదు, ఆహారమూ లేదు, మందులూ లేవు. నా పాపను ఎలా రక్షించగలను?” అని ప్రపంచానికి తన ఆవేదనను వినిపిస్తోంది.
గాజాలో తీవ్రమైన కరువు తాడవిస్తోందని ఐక్యరాజ్యసమితి మద్దతుతో పని చేస్తున్న అంతర్జాతీయ ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. నివేదికల ప్రకారం, గాజా జనాభాలో పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్ర ఆహార కొరతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శిశువులు, గర్భిణీ మహిళలు మరియు అనారోగ్యంతో ఉన్నవారికి తగిన ఆహారం, వైద్య సేవలు అందక ప్రాణహానికి గురవుతున్నారని వారు పేర్కొన్నారు.
మానవత్వాన్ని తట్టిలేపే చిన్నారుల వేదన..
-నాసర్ హాస్పిటల్ … గాజాలో నాలుగు మాత్రమే మిగిలిన కేంద్రాల్లో ఇది ఒక ఆసుపత్రి – మృత్యువుకి అంచున ఉన్న చిన్నారులకి ఇది చివరి ఆశ.
-ఆసుపత్రి గోడలపై కార్టూన్ చిత్రాలు, పిల్లల హాస్యంతో – కానీ ఆ గోడల కింద పిల్లలు నిశ్శబ్దంగా… కదలకుండా… ఏడ్చే శక్తిలేని స్థితిలో పడుకుని ఉన్నారు.
-అక్కడ ఆ పిల్లల తల్లులంతా ఆకలితో అలసిపోయి మంచాల్లో పడి ఉంటారు. పసి పిల్లలకు పాలివ్వలని ఆ తల్లుల వేదన వర్ణనాతీతం. ‘‘నాకు తినే తిండి కూడా లేకపోయింది. ఇక నా బిడ్డకు పాలు ఎక్కడనుంచి వస్తాయి.’’ అని జైనబ్ రిజ్వాన్ అనే తల్లి రోదిస్తోంది.
-మార్చి 2024లో గాజాకు సరఫరాలు నిలిపివేసినప్పటి నుంచి, వేలాది మంది బిడ్డలు తినడానికి తిండిలేక అలసిపోయారు. మేలో ఆంక్షలు కొంత సడలినా, సహాయం అవసరానికి తగినంత లేదు. “బహుళ స్థాయిలో ఆకలి ముప్పు నెలకొంది.” ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. “బాలింతలు, చిన్నారుల విభాగానికి ప్రత్యేక ఆహారం, పాలు, మెడికల్ సరుకులు… అన్నీ కావాలి. కానీ వాటి కొరత తీవ్రంగా ఉంది.” అని డాక్టర్ ఫరా అంటున్నారు.
‘‘నా మూడు నెలల చిన్నారి. పుట్టినప్పటి కంటే ఇప్పుడు 100 గ్రాముల తక్కువ బరువుంది. మూడు నెలల్లో ఒక్క గ్రాము కూడా పెరగలేదు. చర్మం మీద ఎముకలు మాత్రమే మిగిలిపోయాయని అబూ అమౌనా అనే మహిళ రోదిస్తోంది.
“చూడండి… ఇవి నా బిడ్డ చేతులు… ఇవి కాళ్లు… ఒక్కసారైనా నిద్రపోతుందేమో అని చూస్తున్నా.” అని మరోతల్లి చెబుతోంది. జైనబ్ అనే 5 నెలల పాప ఆకలితో చనిపోయింది. తల్లిదండ్రులు ఆ పసి గుడ్డును తెల్ల కప్పుతో చుట్టి పూడ్చడానికి తీసుకెళ్లారు.
శిశువులకు పాలూ లేవు పాల పదార్థాలూ లేవు… మందులూ లేవు… పిల్లలకు ఆకలి మాత్రమే ఉంది – ప్రపంచానికి వినిపించేలా చెప్పేదెవరు?
ఈ గాజా చిన్నారుల వేదన… మానవతను కదిలించే పిలుపు అవ్వాలి!
ముహమ్మద్ ముజాహిద్, 9640622076