జెరూసలేం: గాజాలో ఆహారం, అవసరమైన సేవలు “కనిష్ట స్థాయికి క్షీణించాయి” అని ఐక్యరాజ్యసమితి మద్దతుగల ఆహార భద్రతా బృందం హెచ్చరించింది. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (IPC) దీనిని “కరువు దృశ్యం”గా అభివర్ణించింది, ముట్టడిలో ఉన్న గాజా ఎన్‌క్లేవ్‌లో ఆహారం, స్వచ్ఛమైన నీరు,ప్రాథమిక ఆరోగ్య సేవల కొరతను ఎదుర్కొంటోంది.
విస్తృతమైన ఆకలి, పోషకాహార లోపం, వ్యాధులు ఆకలి సంబంధిత మరణాల పెరుగుదలకు కారణమవుతున్నాయని వెల్లడిస్తుందని CNN నివేదించింది.
Like apocalypse: Civilians as aid trucks entered Rafah, Gaza. pic.twitter.com/g5GT7w3QBh
— Clash Report (@clashreport) July 27, 2025
గాజా నగరంలో ఎక్కడ చూసినా కరువు విలయతాండవం చేస్తోంది. రెండు లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు ఆహార అభద్రతతో కొట్టుమిట్టాడుతున్నారని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో యునిసెఫ్ ఇటీవల విడుదల చేసిన పోస్ట్ తెలిపింది. వారంతా తీవ్రమైన ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గాజాలో పెద్ద ఎత్తున ఆకలి మరణాలు సంభవిస్తాయని వందకు పైగా ఎన్జీఓలు హెచ్చరించాయి.
ఏప్రిల్, జూలై మధ్య కాలంలో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న 20,000 మందికి పైగా పిల్లలకు ఆరోగ్య కార్యకర్తలు చికిత్స అందించారని, వారిలో 3,000 మందికి పైగా తీవ్రంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (IPC) తెలిపింది. “తాజా డేటా ప్రకారం, గాజా స్ట్రిప్‌లోని చాలా ప్రాంతాలలో తీవ్రమైన పోషకాహార లోపంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది.
పోరాటాన్ని ముగించడానికి, పెద్ద ఎత్తున మానవతా సహాయాన్ని అనుమతించడానికి “తక్షణ చర్య” తీసుకోవాలని ఐపీసీ పిలుపునిచ్చింది. మే నెలలో గాజాలోని ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఆహార అభద్రతను” ఎదుర్కొంటున్నారని, కరువు ప్రమాదం”లో ఉన్నారని IPC హెచ్చరించింది.
“ఇది స్పష్టంగా మన కళ్ళ ముందు, మన టెలివిజన్ తెరల ముందు జరుగుతున్న విపత్తు” అని UN ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) డైరెక్టర్ రాస్ స్మిత్ అన్నారు. “ఇది హెచ్చరిక కాదు, ఇది చర్యకు పిలుపు. ఈ శతాబ్దంలో మనం చూసిన దానికి భిన్నంగా ఇది ఉంది” అని ఆయన అన్నారు.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, దాదాపు 60,000 మంది పాలస్తీనియన్లను చంపేశారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా UN అంచనాల ప్రకారం, గాజాలో, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 71,000 మంది పిల్లలతో సహా 470,000 మందికి పైగా ప్రజలు ఇప్పుడు ఆకలితో ఉన్నారు.
గాజాకు అత్యవసర సహాయ సామగ్రి చేరకుండా ఇజ్రాయిల్ దళాలు అష్టదిగ్బంధనం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధిపతి తెలిపారు. సహాయాన్ని అడ్డుకోవడం, ఆంక్షలు విధించడం వంటి చర్యల కారణంగా గాజాలో ఆకలి సంక్షోభం తీవ్రత రమవుతోందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అడ్హనమ్ గేబ్రియేసస్ హెచ్చరించారు. ఆహార సరఫరాలను మార్చి నుంచే ఇజ్రాయిల్ అడ్డుకోవడంతో ప్రస్తుతం గాజాలో ఆహార నిల్వలు అడుగంటుతున్నాయి. మేలో ఆంక్షలను పాక్షికంగా తొలగించినప్పటికీ సరఫరాలు అరకొరగానే ఉన్నాయి. ఆహారం కోసం వేచి ఉన్న ప్రజలపై ఇజ్రాయిల్ సైనికులు జరుపుతున్న కాల్పులలో మే నుంచి ఇప్పటి వరకూ వెయ్యి మందికి పైగా మరణించారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
ఈ విషయమై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాలో ఆకలి లేదని చేసిన వాదనకు విరుద్ధంగా… మొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఈ దుస్థితిని “నిజమైన ఆకలి” అని అభివర్ణించారు,
“నేను గాజాలో అన్నార్తుల ఆకలి కేకలను చూస్తున్నాను. మీరు దానిని నకిలీ అనలేరు. కాబట్టి, గాజాలో అమెరికా “ఆహార కేంద్రాలను” ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు.
సహాయక బృందాలు సురక్షితంగా వెళ్ళడానికి వీలుగా గాజాలోని కొన్ని ప్రాంతాలలో ప్రతిరోజూ 10 గంటల పాటు సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మానవతా అవసరాలను తీర్చడానికి ప్రతిరోజూ 500-600 ట్రక్కులు అవసరమని UN చెబుతుండగా, విధానం మారినప్పటి నుండి దాదాపు 100 ట్రక్కులు మాత్రమే ప్రవేశించాయి.