లక్నో: ఏడేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గోవధ ఆరోపణలపై మూక హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసు ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ సహా స్థానిక యువకుడి ప్రాణాలను బలిగొన్న సంఘటనకు సంబంధించి బీజేపీ నాయకుడు, మాజీ బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ యోగేష్ రాజ్‌తో సహా 38 మందిని జిల్లా కోర్టు దోషులుగా నిర్ధారించింది.
డిసెంబర్ 3, 2018న సయానా తహసీల్‌లోని చింగ్రావతి గ్రామ సమీపంలోని చెరకు తోటలో ఆవుల కళేబరాలు కనిపించాక హింస చెలరేగింది. ఈ పుకార్ల కారణంగా పోలీసులతో ఘర్షణ పడిన ఒక గుంపు, చింగ్రావతి అవుట్‌పోస్ట్‌ను తగలబెట్టి, వాహనాలను ధ్వంసం చేసింది,రాళ్లతో దాడి చేసింది. గోవధ కేసును దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ సింగ్ కాల్చి చంపారు. అదే ఘటనలో స్థానికుడైన 20 ఏళ్ల సుమిత్ కుమార్ పోలీసుల కాల్పుల్లో మరణించాడని ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం 44 మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఈమేరకు కోర్టు 38 మందిని దోషులుగా నిర్ధారించింది — ఐదుగురిపై యోగేష్ రాజ్ సహా సెక్షన్ 302 కింద హత్య, మిగిలిన వారిని అల్లర్లు, దహనం, నేరపూరిత కుట్ర, హత్యాయత్నం నేరాలను మోపారు. ఒక నిందితుడు మైనర్ కాగా, అతనిపై విడిగా విచారణ జరుగుతోంది, మరో ఐదుగురు విచారణ సమయంలో మరణించారు.
38 మంది దోషులకు నేడు శిక్ష ఖరారు చేయనున్నారు. అందరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మూక హింస, గోరక్షణ, కేసు వ్యవస్థాగత జాప్యంపై రాజకీయ ప్రమేయాన్ని హైలైట్ చేసిన కేసులో కోర్టు తీర్పు కీలకమైనదిగా భావిస్తున్నారు.