న్యూఢిల్లీ: పాలస్తీనా జర్నలిస్ట్ సోలిమాన్ హిజ్జీ గాజా స్ట్రిప్‌లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందడానికి ప్రతిరోజూ మార్గాలను వెతుకుతూ ఉంటాడు. తగినంత ఆహారం, నీరు, రవాణాతో పాటు – గాజాకు ఇంటర్నెట్ అవసరం కూడా ఉంది.
గాజాలో ఇంటర్‌నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల అనేకసార్లు తన ఫోన్ మూగబోతోందని హిజ్జీ తన బాధను వ్యక్తం చేశారు. ఆహార సహాయం కోరుతున్న పౌరులను లక్ష్యంగా చేసుకోవడం మరి ఎక్కువైందని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో తన పని రోజురోజుకూ కష్టతరం అవుతోందని ఆ జర్నలిస్ట్ చెప్పారు.
వర్తమానం పాఠకుల కోసం పాలస్తీనా జర్నలిస్ట్ సోలిమాన్ హిజ్జీ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు
{Q} గాజాలో క్షేత్రస్థాయి పరిస్థితి ఏమిటో వివరించగలరా?
గాజా కరువు వర్ణనాతీతం. ఇది చాలా కఠినమైనది, ఎందుకంటే 100 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో నివసిస్తున్న 2 మిలియన్లకు పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కాగా, మిగిలిన 365 చదరపు కిలోమీటర్లను ఇజ్రాయెల్ నియంత్రిస్తుంది. నాలుగు నెలల నుంచి ఆహారం, మందులు, నీరు, ఇంధనాన్ని ఈ ప్రాంతంలోకి ప్రవేశించకుండా ఇజ్రాయెల్ నిరోధించింది. ఈ పరిణామం పాలస్తీనియన్లకు సమిష్టి శిక్షగా ఉంది.
గాజాలో నెలకొన్న కరువు…చాలా మంది పిల్లలు, వృద్ధులు, వ్యాధుల బారిన పడిన వారి జీవితాలను ప్రభావితం చేసింది. ఈ భూమిపై నివసించే జర్నలిస్టులుగా మాపై కూడా కరువు విరుచుకు పడింది. ఫలితంగా చాలా మంది జర్నలిస్టుల మరణానికి దారితీసింది. మేము ఈ భూమి నుండి వచ్చాము, మా దేశం పాలస్తీనా. జర్నలిస్టులు సైతం స్థానికులు ఎదుర్కొంటున్న కష్టాలతోనే ఎదురీదాల్సి వస్తోంది. ఇంధనం,రవాణా అంతరాయం కారణంగా మేము ఎక్కడికీ కదలలేకపోతున్నాము. ఇక ఆహారం, నీరు లేకపోవడం వల్ల మేము ఇప్పటికే అలసిపోయాము.
{Q} గాజాలోని జర్నలిస్టులు భారీ సెన్సార్‌షిప్‌ను ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా కంపెనీలు వారి నీడపై కూడా నిషేధం విధించాయని నివేదికలు ఉన్నాయి. మీరు మీ పనిని ప్రపంచానికి ఎలా చేరుస్తారు?
దురదృష్టవశాత్తు, నేను ఇజ్రాయెల్ అనుకూల గ్రూపులు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చాలా వేధింపులకు గురైన జర్నలిస్టులలో ఒకడిని. మేము ఏమి అనుభవిస్తున్నామో అదే రాస్తున్నాము. ముఖ్యంగా విషాదకరమైన పరిస్థితులు, మా జీవితాలు, కరువు గురించి రాస్తాము. అవే చిత్రీకరించాము, అవే మాట్లాడుతాము కాబట్టి నాపై దాడి చేస్తున్నారు. అనేక పార్టీలతో కలిసి పనిచేయకుండా మమ్మల్ని ఆపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మేము ప్రచురించే కంటెంట్‌ను – గాజాలో యుద్ధ సమయంలో జీవిత వాస్తవికతను మేము రికార్డ్ చేసే విధానం – అనుమానించడం వల్ల వాస్తవాన్ని నివేదించకూడదని మాపై ఒక రకమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది మా జీవనోపాధిని కూడా మూసివేస్తుంది.
{Q} మార్చిలో, డ్రాప్ సైట్ న్యూస్ గాజాలో జరిగిన విధ్వంసాన్ని నమోదు చేయడానికి మీరు చాలా దూరం ట్రెక్కింగ్ చేస్తున్నారని పేర్కొంది. మీ అనుభవాలేమిటి?
దురదృష్టవశాత్తు రవాణా లేకపోవడం, మనకు బలాన్నిచ్చే ఆహారం, మన దాహాన్ని తీర్చే నీటిని పొందలేకపోవడం వల్ల ప్రతి రోజు ముందు రోజు కన్నా కష్టంగా ఉంటుంది.
ఈవెంట్‌ల కవరేజ్‌పై ఇది ప్రభావాన్ని చూపుతుంది, ఎందుకంటే ఈవెంట్‌లను చేరుకోవడానికి, వాటిని కవర్ చేయడానికి మేము కాలినడకన వెళ్లాలి. యుద్ధం కారణంగా మేము ఉపయోగించే జర్నలిస్టిక్ పరికరాల బరువుకు మా కాళ్ళు నొప్పి పుడతాయి. వాతావరణం, ఆరోగ్యం, మానసిక పరిస్థితులు ఎప్పటిలాగే కష్టంగా ఉన్నాయి, అయినప్పటికీ మేము అల్లాహ్ ఇచ్చిన శక్తి మేరకు దృఢ సంకల్పంతో కవరేజీని కొనసాగిస్తున్నాము.
{Q} జర్నలిస్టులుగా మీరు ఇతర నిపుణులకు సహకరించాల్సి ఉంటుంది. మరి మిగతా జర్నలిస్టులతో సహకారం ఎలా ఉంటుందో వివరించగలరా?
అవును. మేము ఎల్లప్పుడూ అందరికి సహకరిస్తాము. కొన్నిసార్లు గాజా స్ట్రిప్‌లోని ప్రతిచోటా కరువు, యుద్ధంపై సంఘటనలు ప్రసారం చేసే ప్రయత్నంలో మేము భౌగోళిక ప్రాంతాలను పంచుకుంటాము. ఖాళీ కడుపుల శబ్దాన్ని, యుద్ధం కారణంగా పిల్లల మరణాన్ని చూసిన అనుభవాన్ని ప్రసారం చేయడానికి మేము ప్రయత్నిస్తాము. అక్కడ ఇంటర్నెట్ బాఉంటే తన చుట్టూ ఉన్న ప్రాంతంలో వారు డాక్యుమెంట్ చేసిన ఫుటేజ్‌ను ప్రసారం చేయడానికి పంపుతాము. ప్రతి సంఘటనను ప్రతిచోటా డాక్యుమెంట్ చేసే, సోషల్ మీడియా ద్వారా ప్రచురించే పబ్లిక్ ప్రెస్‌ను కూడా మేము మర్చిపోము. దానిని చిత్రీకరించిన వ్యక్తితో మేము కమ్యూనికేట్ చేస్తాము. ఫోటో తీసిన విషయాన్ని ఉపయోగిస్తాము. కొన్నిసార్లు మేము దానిని కొనుగోలు చేస్తాము.
{Q} ఇజ్రాయెల్ ప్రపంచ అభిప్రాయాన్ని మార్చడానికి హస్బారా ( ప్రజా దౌత్యం)ని ఉపయోగిస్తుంది, IDF గాజాను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ తనను తాను బాధితురాలిగా చిత్రీకరిస్తుంది. ఇజ్రాయెల్ అనుకూల సోషల్ మీడియా తరచుగా యుద్ధ నేరాలను తిరస్కరిస్తుంది. దాని వినియోగదారులు గాజాలో ‘సాధారణ స్థితి’ని చూపించడానికి ప్రయత్నిస్తారు. ఈ కథనాలను నమ్మేవారికి మీరేం చెబుతారు?
దురదృష్టవశాత్తు, గాజాలో ఏమి జరుగుతుందో అనుమానించే వారికి ఎటువంటి జవాబు లభించదు. ఎందుకంటే వారు అబద్ధాలు చెబుతారు, సత్యాన్ని పట్టించుకోకుండా దానితో పోరాడుతారు. వారు పిల్లలు, మహిళలు, పౌరులను హత్య చేయడానికి మద్దతు ఇస్తారు. నిరాధారమైన కారణాలతో అమాయక ప్రజలను హత్య చేయడాన్ని సమర్థిస్తారు.
{Q} ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనియన్లు, ఇతరులు ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ ఎవరూ మాట్లాడని కథలను మీరు చూసి, అనుభవించారా?
గాజా స్ట్రిప్‌లో ఏమి జరుగుతుందో మనం ఎన్ని ఫోటోలు తీసి ప్రసారం చేసినా, మనం డాక్యుమెంట్ చేసేది మనం కవర్ చేయని వాటిలో ఒక చిన్న భాగం మాత్రమే. సైన్యం ప్రతిరోజూ జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటోంది. దీంతో జర్నిలిస్టుల కార్యకలాపాలను కూడా ప్రభావితం చేస్తోంది. తరచుగా, ఇజ్రాయెల్ కథనానికి సరిపోయేలా సోషల్ మీడియా, అంతర్జాతీయ ఏజెన్సీలు ప్రసారం చేసే ప్రతిదాన్ని బ్లాక్ చేస్తాయి.
{Q} గాజాలో అంతర్జాతీయ జర్నలిస్టులు ప్రవేశించకుండా నిషేధం ఉంది. దీంతో ఎక్కువగా ఫ్రీలాన్సర్లు, స్ట్రింగర్లపై ఆధారపడక తప్పదు. అంతర్జాతీయ వార్తా సంస్థలు మైదానంలో పాలస్తీనియన్ జర్నలిస్టులను పర్మినెంట్‌గా ఎందుకని నియమించుకోవు?
దురదృష్టవశాత్తు, మైదానంలో చాలా అంతర్జాతీయ ఏజెన్సీలు, వార్తాపత్రికలు, ఛానెల్‌లు జర్నలిస్టిక్ పనిలో నిజాయితీగా లేవు. ఆర్థిక బాధ్యతను భరించాల్సి వస్తుందనే భయంతో, తమతో సహకరించే వారి రక్షణ కోసం కూడా వారు జర్నలిస్టులతో రాతపూర్వకంగా ఒప్పందం కూడా చేసుకోని స్థితికి చేరుకున్నారు. ఈ యుద్ధంలో, తమ సహోద్యోగుల రక్షణ గురించి పట్టించుకోని పెద్ద ఏజెన్సీలు, పెద్ద పేరున్న ఛానెల్‌లను మనం చూశాము. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సంఘటనల ప్రచురణను పరిమితం చేయాలని ఇజ్రాయెల్ ఒత్తిడి సమూహాలు రెచ్చగొడతాయి. వారు ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్నారు, వారిపై బాంబు దాడి చేశారు. వారి కుటుంబ సభ్యులను చంపారు.
{Q} పాలస్తీనా పరిస్థితి చుట్టూ ఉన్న ఆధిపత్య కథనం 2023 అక్టోబర్ 7 నుండి ఏమి జరిగిందో దానిపై కేంద్రీకృతమై ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ మీరు అంతకు ముందు ఇజ్రాయెల్ దురాగతాలను డాక్యుమెంట్ చేయడానికి పనిచేశారు – మీ 2021 చిత్రం సో దే నో వి ఎక్సైటెడ్. ప్రతిదీ 2023 అక్టోబర్ 7 తర్వాత ప్రారంభమైందని చెప్పే వ్యక్తికి మీరు ఏమి చెబుతారు?
ఇజ్రాయెల్ అక్టోబర్ 7 తేదీని అంటిపెట్టుకుని, తాను చేసే ప్రతి పని ఆ రోజుకు ప్రతిస్పందన అని ప్రపంచానికి చెబుతుంది. ఖైదీలను పట్టుకున్నట్లు అబద్ధం చెబుతుంది. ఈ తప్పుడు సాకుతో తాను చేసే ప్రతి పనిని దాచడానికి ప్రయత్నిస్తుంది, ఎందుకంటే ఇజ్రాయెల్ 60,000కు పైగా పౌరులను, వారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలను హత్య చేసింది. కొన్ని కుటుంబాలను జనాభా రిజిస్టర్ నుండి తొలగించింది. ఇది ఆకలిని ఆయుధంగా ఉపయోగించుకుంది. 2 మిలియన్లకు పైగా ప్రజలపై వివిధ రకాల సామూహిక శిక్షలను విధించడానికి దీనిని ఒక సాకుగా ఉపయోగించుకుంది. ఇది పౌరులపై ఊచకోతలకు పాల్పడింది. ఇజ్రాయెల్ తప్ప ప్రపంచం మొత్తం అంతర్జాతీయ చట్టం ద్వారా నియంత్రితమవుతుంది. ఈ విధానాల నుండి ఇప్పుడు ఎవరూ దానిని ఆపడానికి ప్రయత్నించడం లేదు.