హైదరాబాద్: హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’-XI కింద గత నెలలో 7,678 మంది పిల్లలను రక్షించామని, వారిలో 6,000 మందికి పైగా బాల కార్మికులని అధికారులు శుక్రవారం తెలిపారు.
రైల్వే, బస్ స్టేషన్లు, మతపరమైన ప్రదేశాలు, ఇటుక బట్టీలు, మెకానిక్ దుకాణాలు, నిర్మాణ స్థలాలు, టీ స్టాళ్లు సహా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదేశాలను మ్యాప్ చేసి, 12 రాష్ట్రాల నుండి అక్రమంగా తీసుకొచ్చిన మొత్తం 7,678 మంది పిల్లలను (7149 మంది బాలురు, 529 మంది బాలికలు),నేపాల్ నుండి వచ్చిన నలుగురిని రక్షించామని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (మహిళా భద్రతా విభాగం) చారు సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఆపరేషన్‌లో 1,713 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసారు. 1,718 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా వీరిలో 6,593 మంది పిల్లలను కుటుంబాలతో తిరిగి కలిపారు. 1,049 మందిని రెస్క్యూ హోమ్‌లలో చేర్చారు.
మొత్తంగా పిల్లలకు చాకిరీ నుంచి విముక్తి కలిగించేందుకు ప్రతీ ఏటా జులైలో చేపట్టే ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమం మంచి ఫలితాలు ఇచ్చింది.
ఆపరేషన్ ముస్కాన్ అనేది తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారికి పునరావాసం కల్పించడానికి హోం మంత్రిత్వ శాఖ (MHA) చేపట్టిన ప్రాజెక్ట్. ఇది నెల రోజుల పాటు జరిగే ప్రచారం, దీనిలో రాష్ట్ర పోలీసు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తప్పిపోయిన పిల్లలను గుర్తించి రక్షిస్తారు. అంతేకాదు వారి కుటుంబాలతో తిరిగి కనెక్ట్ చేయడానికి వివిధ చర్యలు తీసుకుంటారు.