డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో క్లౌడ్‌బరస్ట్‌తో ఆకస్మిక వరదలొచ్చాయి. దీంతో నలుగురు మరణించారు. కనీసం 50 మంది గల్లంతయ్యారు. కొండలపై నుంచి ఉధృతంగా వస్తున్న వరద ప్రవాహానికి ఇళ్లు, పంటలు కొట్టుకుపోతున్న దృశ్యాలను పర్యాటకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. హోటళ్ల నుంచి మార్కెట్ల వరకు అన్నీ ధ్వంసమయ్యాయని, ఇటువంటి విపత్తును తాను గతంలో ఎన్నడూ చూడలేదని ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు.
ఫలితంగా అనేక హోటళ్ళు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలకు నిలయమైన ధరాలి గ్రామంలో బురద విలయం సృష్టించింది. ఆకస్మిక వరదల కారణంగా ఇళ్ళు పేకమేడలా నేలమట్టమై కొట్టుకుపోతున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. సహాయం కోసం స్థానికులు కేకలు వేయడం వినిపించింది.
కుండపోత వర్షం ధాటికి ఉప్పొంగిన నీరు… కొండ రెండు వైపులా ప్రవహించింది, ఒకటి ధరాలి వైపు, మరొకటి సుక్కి గ్రామం వైపు అని రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు.
ఉత్తరకాశి జిల్లాలోని హర్సిల్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ ఆకస్మిక వరదలకు దారితీసింది, అక్కడి ఒక శిబిరం నుండి 11 మంది భారత సైనిక సిబ్బంది తప్పిపోయినట్లు సమాచారం.
ఉత్తరకాశిలో ఇప్పటికీ రెడ్ అలర్ట్ అమలులో ఉంది. రాష్ట్రం హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసింది – 01374-222722, 7310913129, 7500737269, 0135-2710334, 2710335, 8218867005, 9058441404.
ఉత్తరాఖండ్ సీఎంకు అమిత్ షా ఫోన్
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామితో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్లో మాట్లాడారు. వరదల ధాటికి ధరాలి గ్రామంలో జరిగిన భారీ విధ్వంసం గురించి మాట్లాడారు. కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. సహాయక చర్యల కోసం ధరాలికి వెళ్లాలని ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలను ఆయన ఆదేశించారు.
కాగా, ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఉత్తర కాశీలోని ధరాలి ప్రాంతంలో ఆకస్మిక వరదలతో తీవ్ర నష్టం సంభవించిన వార్త చాలా బాధాకరం.. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం, ఇతర బృందాలు సహాయ, రక్షణ చర్యలలో నిమగ్నమై ఉన్నాయని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
మరోవంక ఉత్తరాఖండ్‌లో తరచుగా క్లౌడ్ బరస్ట్ సంభవించడానికి కారణం వాతావరణ మార్పులేనని నిపుణులంటున్నారు. ఇక్కడి ప్రాంతాలు వరదల బారిన పడకుండా సమగ్ర వరద నిర్వహణ వ్యూహాలు అవసరం అని చెబుతున్నారు. దక్షిణాసియా నెట్‌వర్క్ ఆన్ డ్యామ్స్, రివర్స్ & పీపుల్‌కు చెందిన హిమాన్షు థక్కర్ మాట్లాడుతూ… ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వర్షపాత అంచనాలపై గట్టి పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.
వరదల ధాటికి కొట్టుకుపోతున్న గ్రామం
A massive flash flood swallows houses in #Uttarkashi as people scream in fear. As per authorities many people feared trapped.@ukcmo #Uttarkhand #Cloudburst#Rainfall#Himalaya pic.twitter.com/Ja8qVzGtL7
— The Environment (@theEcoglobal) August 5, 2025