డేర్ అల్-బలా: సంక్షుభిత గాజా ప్రాంత ప్రజలకు మానవతా సాయం అందిస్తున్న ట్రక్ డ్రైవర్ల పరిస్థితి ప్రమాదంలో పడింది. హింసాత్మక ముఠాలు ట్రక్కుల్లోని ఆహారాన్ని దొంగిలించే క్రమంలో డ్రైవర్లను తుపాకీతో బెదిరిస్తున్నారు. మరికొన్ని సార్లు డ్రైవర్ల ప్రాణాన్ని హరిస్తున్నారు. ఇజ్రాయెల్ మారణకాండ కారణంగా ఆకలితో ఉన్న అన్నార్తులకు ఆహారం అందించే క్రమంలో ట్రక్ డ్రైవర్లకు ప్రమాదకరంగా మారింది
మరోవంక ఆకలితో ఉన్న ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి కదిలే ట్రక్కుల వెనుక నుండి సహాయాన్ని లాక్కుంటారని స్థానిక డ్రైవర్లు తెలిపారు. గాజా మార్కెట్లలో అధిక ధరలకు సహాయాన్ని విక్రయించే ముఠాల కోసం పనిచేసే సాయుధ వ్యక్తులు కొన్ని ట్రక్కులను హైజాక్ చేస్తారు. ఇక ఇజ్రాయెల్ దళాలు ఎప్పుడు కాల్పులు జరుపుతారో చెప్పలేమని వారు వాపోయారు.
హమాస్‌తో ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించకుండా, గాజాలోకి ఎటువంటి మానవతా సాయాన్ని రాకుండా దిగ్బంధించిన విషయం తెలిసిందే. ఫలితంగా గత మార్చి నుండి దాదాపు 2 మిలియన్ల పాలస్తీనియన్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. అంతర్జాతీయ నిపుణులు ఇప్పుడు గాజాలో నెలకొన్న “కరువు” గురించి హెచ్చరిస్తున్నారు.
అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి రావడంతో, ఇజ్రాయెల్ గత వారం గాజాలోకి సహాయాన్ని అనుమతించే చర్యలను ప్రకటించింది. సహాయక బృందాలు మాత్రం ఇజ్రాయెల్ తీసుకున్న ఈ చర్యలు సరిపోదని చెబుతున్నారు. మరోవంక సరిహద్దు క్రాసింగ్‌ల నుండి అవసరమైన వారికి ఆ మొత్తాన్ని కూడా అందించడం కష్టం, చాలా ప్రమాదకరమని డ్రైవర్లు తెలిపారు.
ఇజ్రాయెల్ కొత్త దాడిని ప్లాన్ చేస్తున్నందున నెతన్యాహు గాజాలో పరిమిత సహాయాన్ని అనుమతిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహాయ ట్రక్కులను నడపడం ప్రాణాంతకం కావచ్చని చెబుతున్నారు. ఇటీవలి జరిగిన సంఘటనలే వీటిని దృవపరుస్తున్నాయి. మొన్నటికి మొన్న ఆహార సామాగ్రితో రెండు ట్రక్కులు దక్షిణ గాజాలోకి ప్రవేశించడంతో వేలాది మంది ఆ ట్రక్‌ను చుట్టుముట్టారని AP వీడియో చూపించింది. యువకులు ట్రక్కుల పైకప్పులపై నిలబడి, పక్కల నుండి వేలాడుతూ, సహాయ సామాగ్రి పెట్టెలను పట్టుకోవడానికి తోపులాటలు జరిగాయి.
“నా డ్రైవర్లలో కొందరు సహాయానికి వెళ్లడానికి భయపడుతున్నారు ఎందుకంటే వారు ఎప్పుడు ఏ ప్రమాదంలో చిక్కుకుంటామోనని ఆందోళన చెందుతున్నారు” అని గాజా స్ట్రిప్ అంతటా ప్రైవేట్ రవాణా సంస్థలతో కలిసి పనిచేసే స్పెషల్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అబు ఖలీద్ సెలిమ్ అన్నారు.
తన మేనల్లుడు, అష్రఫ్ సెలిమ్ జూలై 29న తాను నడుపుతున్న సహాయ ట్రక్కుపైకి ఎక్కుతున్న జనంపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరపడంతో బుల్లెట్ దెబ్బకు మరణించాడని సెలిమ్ చెప్పాడు.
షిఫా హాస్పిటల్ అధికారులు అతని మృతదేహాన్ని అందుకున్నట్లు తెలిపారు, తలపై తుపాకీ కాల్పులు జరిగాయి. ఇజ్రాయెల్ సైన్యం ఈ సంఘటన గురించి తమకు తెలియదని,”నియమం ప్రకారం” సహాయ ట్రక్కులపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయదని తెలిపింది.
యుద్ధం ప్రారంభంలో, సహాయ సామాగ్రిని డెలివరీ చేయడం సురక్షితంగా ఉంది. అయితే ఇప్పుడు, “పరిస్థితి అనువుగా లేదని సెలిమ్ అన్నారు, సహాయ ట్రక్కులు గిడ్డంగులకు చేరుకోవడానికి రక్షణ కోసం విజ్ఞప్తి చేశారు.
ఇజ్రాయెల్ దళాల నుండి రక్షణను UN అంగీకరించదు, ఇది దాని తటస్థ నియమాలను ఉల్లంఘిస్తుందని చెబుతుంది. సహాయం అత్యవసర అయినందున, ఆకలితో ఉన్న ప్రజలు ట్రక్కుల వెనుక నుండి ఆహారాన్ని లాక్కుంటున్నారని అంగీకరించింది.
డ్రైవర్లకు ప్రమాదం పెరుగుతోంది
22 ఏళ్ల అలీ అల్-డెర్బాషి, ఒకటిన్నర సంవత్సరాలకు పైగా సహాయ ట్రక్ డ్రైవర్‌గా ఉన్నాడు, కానీ పెరుగుతున్న ప్రమాదం కారణంగా మూడు వారాల క్రితం అతను డ్యూటీ నుంచి వైదొలిగాడు అని ఆయన అన్నారు. ట్రక్కుల నుండి సహాయం తీసుకుంటున్న కొంతమంది ఇప్పుడు క్లీవర్లు, కత్తులు, గొడ్డలిని తీసుకెళ్తున్నారని ఆయన అన్నారు.
“దీని కోసం మేము మా ప్రాణాలను పణంగా పెడుతున్నాం. ప్రతిసారీ రెండు లేదా మూడు రోజులు మా కుటుంబాలను వదిలివేస్తాము. మాకు నీరు, ఆహారం కూడా లేదు,” అని అతను చెప్పాడు. ప్రమాదంతో పాటు, డ్రైవర్లు ఇజ్రాయెల్ దళాల నుండి అవమానాన్ని ఎదుర్కొన్నారని, వారు వారిని “సుదీర్ఘమైన శోధనలు, అస్పష్టమైన సూచనల కారణంగా గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉంది” అని అతను చెప్పాడు.
కాగా, 2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలోని ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి జరిపారు. దీనికి ప్రతీకార దాడిలో 61,000 మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ చంపేసింది.