హైదరాబాద్: “పుష్ప-2” సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి పోలీసు శాఖ సమర్పించిన నివేదికపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిషన్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి,హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
పోలీసులపై NHRC అసంతృప్తి
పెద్ద సంఖ్యలో జనం గుమిగూడినప్పటికీ తగిన భద్రత కల్పించడంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోందని NHRC తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ఎందుకు చెల్లించకూడదని కమిషన్ ప్రశ్నించింది.
‘సినిమా ప్రీమియర్ షోకి పోలీసుల అనుమతి లేదని రిపోర్టులో తెలిపారు. పర్మిషన్ లేకుంటే నటుడు, అభిమానులు ఎందుకు వచ్చారో తెలియడం లేదు. ముందే తగిన చర్యలు తీసుకొని ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి 6 వారాల్లోగా మరో నివేదిక సమర్పించాలి” అని సీఎస్‌ను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. ఈ కేసుపై నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించి ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్ పోలీసు కమిషనర్‌ను సైతం ఆదేశించింది దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని తెలంగాణ పోలీసులకు సూచించింది.
కాగా, NHRC దృఢమైన వైఖరి అటువంటి తొక్కిసలాట సంఘటనల సమయంలో చట్ట అమలు సంస్థల నుండి ప్రజా భద్రత, జవాబుదారీతనం ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.
కాగా, సంధ్య థియేటర్ వద్ద లాఠీచార్జి, తొక్కిసలాటలో రేవతి మరణం, ఆమె ఇద్దరు పిల్లలు గాయపడడంపై ఇమ్మనేని రమణారావు అనే న్యాయవాది చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ నోటీసులు జారీ చేసింది.