హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్ అంతటా నిన్న కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, వివిధ జోన్లలో 43 విద్యుత్ ఫీడర్లు (11 కెవి) దెబ్బతిన్నాయి, కొన్ని నివాస, వాణిజ్య ప్రాంతాలలో విద్యుత్ సరఫరాపై ప్రభావం పడింది. బంజారాహిల్స్ (11 ఫీడర్లు), సికింద్రాబాద్ (12), హైదరాబాద్ సెంట్రల్ (3), హైదరాబాద్ సౌత్ (1), సైబర్ సిటీ (5), రాజేంద్రనగర్ (2), సరూర్‌నగర్ (1), హబ్సిగూడ (1), మేడ్చల్ (7) ఫీడర్లలో అంతరాయాలు సంభవించాయి.
హబ్సిగూడ-మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మౌలా అలీ, ఎఎస్ రావు నగర్, ఎఎస్ రాజు నగర్, బాబు రెడ్డి నగర్ వంటి ప్రాంతాల్లో, భారీ గాలులు, వర్షం కారణంగా చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. టిజిఎస్‌పిడిసిఎల్ సిబ్బంది త్వరగా స్పందించి, శిథిలాలను తొలగించి, ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
అప్రమత్తంగా ఉన్న విద్యుత్ అధికారులు
ఈ మేరకు TGSPDCL CMD ముషారఫ్ ఫారూఖీ, జోనల్ చీఫ్ ఇంజనీర్లు, సర్కిల్ చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ అంతటా అన్ని ఫీడర్లు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించే వరకు విధుల నుండి బయటకు వెళ్లవద్దని ఫీల్డ్ అధికారులను ఆదేశించారు.
అంతేకాదు ప్రభావిత సర్కిల్‌ల సూపరింటెండింగ్ ఇంజనీర్లను అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ పునరుద్ధరణపై నిరంతరాయంగా పని చేయాలని కూడా ఆదేశించారు. సిబ్బంది క్షేత్ర స్థాయిలోనే ఉండి ఏవైనా కొత్త ఫిర్యాదులను పరిష్కరించాలని అభ్యర్థించారు.
పౌర జీవితానికి అంతరాయం
హైదరాబాద్‌లో ఇప్పటికీ భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుఫానులు సంభవిస్తున్నాయి, ఫలితంగా వివిధ నగర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు, నీటి ఎద్దడి, చెట్లు విరిగిపడటం వంటి సంఘటనలు చోటుచేసుకున్నయి. GHMC, IMD ఆరంజ్ అలర్ట్ జారీ చేసి, లోతట్టు ప్రాంతాలలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించాయి.
నగరంలో ఎలాంటి కరెంట్ సమస్యలు ఎదురైనా… స్థానికుల TGSPDCL హెల్ప్‌లైన్ నంబర్‌ల ద్వారా ఉన్నతాధికారులను సంప్రదించాలని విద్యుత్ సిబ్బంది అభ్యర్థించారు.