న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించేందుకు, వాస్తవాలను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుందనే విమర్శలు వెళ్లువెత్తుతున్న వేళ… ఎన్‌సీఈఆర్‌టీ మరో వివాదాస్పద చర్యకు పాల్పడింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 8వ తరగతి చరిత్ర సిలబస్ నుండి టిప్పు సుల్తాన్, హైదర్ అలీ, రజియా సుల్తాన్, నూర్జహాన్ వంటి ప్రముఖ చారిత్రక వ్యక్తులను తొలగించింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020, పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ (NCF-SE) 2023 కింద ఈ మార్పు జరిగింది.
సాంఘిక శాస్త్రాల కొత్త పాఠ్యపుస్తకంలో ఇప్పుడు 18వ శతాబ్దపు మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్, అతని తండ్రి హైదర్ అలీ గురించి ప్రస్తావించలేదని విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి పేర్కొన్నారు. ఢిల్లీ సుల్తానేట్‌కు చెందిన రజియా సుల్తానా, నూర్జహాన్ గురించి కూడా ప్రస్తావించలేదు.
టిప్పు సుల్తాన్ తన ధైర్యసాహసాలకు ప్రసిద్ధి చెందాడు. అప్పట్లోనే ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకున్నాడు. అతను, అతని తండ్రి హైదర్ అలీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. భారతదేశానికి ముఖ్యమైన స్వాతంత్ర్య పోరాట ఉద్యమం అయిన ఆంగ్లో-మైసూర్ యుద్ధాలకు నాయకత్వం వహించారు. రజియా సుల్తానా,నూర్జహాన్ కూడా భారత చరిత్రలో ప్రముఖ మహిళామణులు. పాఠ్యపుస్తకాలనుండి వారి పేర్లను, వారి పోరాటాన్ని పూర్తిగా మినహాయించడం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. దీనిపై అభ్యంతరాలను లేవనెత్తుతూ, ఎంపీ రితాబ్రత బెనర్జీ ఆగస్టు 6న పార్లమెంటులో తన ఆందోళనలను వ్యక్తం చేశారు.
సిలబస్‌ను విద్యార్థులకు తగిన విధంగా మార్చడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. “విద్యార్థులకు తగిన విధంగా కంటెంట్‌ను రూపొందించడానికి ఇది జరిగింది” అని ఆయన అన్నారు.
ఈ సవరణలో రాణి దుర్గావతి, అహ్లియాబాయి హోల్కర్, రాణి అబ్బక్క వంటి ఇతర చారిత్రక వ్యక్తుల పేర్లు ఉన్నాయి. పాఠ్యాంశాలు వివరణాత్మక జీవిత చరిత్రలను కాకుండా నాగరికతల విస్తృత అవలోకనాన్ని ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాయని విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ సవరించిన పాఠ్యపుస్తకాన్ని నాలుగు ఇతివృత్తాలుగా విభజించారు. 1. భారతదేశం -ప్రపంచం, 2. భూమి – ప్రజలు, 3. పాలన – ప్రజాస్వామ్యం, 4. మన చుట్టూ ఉన్న ఆర్థిక జీవితం. ఈ సవరణ క్షేత్రస్థాయి ఆధారాల ద్వారా చరిత్రను అర్థం చేసుకోవడం పెంపొందిస్తుందని NCERT పేర్కొంది.
కాగా, వివిధ తరగతుల వారికి బోధించే చరిత్ర పాఠ్యపుస్తకాల నుండి ముస్లిం వ్యక్తులను తొలగించే ప్రయత్నంగా కార్యకర్తలు ఈ చర్యను ప్రశ్నించారు.
కాగా, నూతన జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) చేపడుతున్న పాఠ్యాంశాల సవరణ తీవ్ర వివాదాస్పదమవుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించేందుకు, వాస్తవాలను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. పాఠ్యాంశాల తొలగింపును మేధావి వర్గం తీవ్రంగా తప్పుపడుతోంది. ఎన్సీఈఆర్‌టీ నిర్ణయం వెనుక విభజన ఉద్దేశం స్పష్టమవుతుందని, ఇది మన రాజ్యాంగ ధర్మానికి, భారత ఉపఖండ సమ్మిళిత సంస్కృతికి వ్యతిరేకమని వారు విమర్శించారు.