టెల్ అవీవ్, ఇజ్రాయెల్: గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునే ప్రణాళికకు ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది. ఈ ప్రణాళికకు మెజారిటీ కేబినెట్ మంత్రులు మద్దతు పలికారు. హమాస్‌ను మట్టుబెట్టడం, వారి వద్ద బందీలుగా ఉన్న వారిని తిరిగి తీసుకురావడానికి ఇంతకంటే మరో మార్గం లేదని మంత్రివర్గం అభిప్రాయపడింది. శుక్రవారం తెల్లవారుజామున తీసుకున్న నిర్ణయం హమాస్ అక్టోబర్ 7 దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ప్రారంభించిన 22 నెలల యుద్ధానికి పరాకాష్టను సూచిస్తుంది.
యుద్ధం ఇప్పటికే వేల మంది పాలస్తీనియన్లను చంపింది, గాజాలో ఎక్కువ భాగాన్ని నాశనం చేసింది. దాదాపు 2 మిలియన్ల పాలస్తీనియన్ల భూభాగాన్ని కరువు వైపు నెట్టివేసింది.
గురువారం ప్రారంభమై రాత్రంతా కొనసాగిన భద్రతా మంత్రివర్గ సమావేశానికి ముందు, ఇజ్రాయెల్ మొత్తం భూభాగంపై తిరిగి నియంత్రణను స్వాధీనం చేసుకోవాలని, చివరికి హమాస్‌ను వ్యతిరేకించే స్నేహపూర్వక అరబ్ దళాలకు దానిని అప్పగించాలని యోచిస్తోందని నెతన్యాహు చెప్పారు.
కాగా, ఇజ్రాయెల్ ప్రతిపాదనపై అంతర్గతంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా తీసుకున్న ఈ చర్య హమాస్ వద్ద ఉన్న మిగిలిన 20 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది బందీలను ప్రమాదంలో పడేస్తాడని, దాదాపు రెండు సంవత్సరాల ప్రాంతీయ యుద్ధాల తర్వాత ఇజ్రాయెల్ సైన్యాన్ని మరింత ఒత్తిడికి గురిచేస్తాడని హెచ్చరించినట్లు తెలిసింది. ఇజ్రాయెల్ నిర్ణయాన్ని అనేక బందీల కుటుంబాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.
కాగా, మరికొందరు జెరూసలేంలో జరిగిన భద్రతా క్యాబినెట్ సమావేశం వెలుపల నిరసన తెలిపారు. ఇజ్రాయెల్ మాజీ భద్రతా అధికారులు కూడా ఈ ప్రణాళికను వ్యతిరేకించారు. అంతకు ముందు ఓ ఇజ్రాయెల్ అధికారి మాట్లాడుతూ, భద్రతా క్యాబినెట్ ఇజ్రాయెల్ నియంత్రణలో లేని గాజాలోని అన్ని భాగాలను స్వాధీనం చేసుకునే ప్రణాళికలను చర్చిస్తుందని చెప్పారు.
మరోవంక ఇజ్రాయెల్ ప్రణాళికపై శరణార్థి శిబిరంలో నివసిస్తున్న మైసా అల్-హీలా అనే స్థానికుడు మాట్లాడుతూ… గాజాలో “ఆక్రమించడానికి ఏమీ లేదు” అని అన్నారు. గురువారం దక్షిణ గాజా అంతటా ఇజ్రాయెల్ వైమానిక దాడులు, కాల్పుల్లో కనీసం 42 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆసుపత్రులు తెలిపాయి.