గువహతి: అక్రమ హిందూ వలసదారులపై పౌరసత్వానికి సంబంధించిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని అస్సాం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ… ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించింది.
పౌరసత్వం (సవరణ) చట్టం (CAA) ను ఉటంకిస్తూ 2015 కి ముందు రాష్ట్రంలోకి ప్రవేశించిన ఆరు వర్గాలైన హిందూ, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీలపై కేసులను ఉపసంహరించుకోవాలని తన ప్రభుత్వం… విదేశీయుల ట్రిబ్యునల్‌లను కోరినట్లు వచ్చిన మీడియా నివేదికలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తోసిపుచ్చారు.
అయితే, ముఖ్యమంత్రి హామీలు రాష్ట్రంలో CAA వ్యతిరేక నిరసనలకు దారితీసిన AASU పై ఎటువంటి ప్రభావం చూపడం లేదు. గౌహతిలో, AASU కామ్రూప్ మహానగర్ జిల్లా యూనిట్ సభ్యులు స్వాహిద్ న్యాస్ ముందు సమావేశమయ్యారు, అక్కడ వారు ప్రభుత్వ ఉత్తర్వు కాపీలను తగలబెట్టి…రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
ఈమేరకు AASU అధ్యక్షుడు ఉత్పల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, “బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చిన హిందూ వలసదారులపై పౌరసత్వానికి సంబంధించిన కేసులను ఉపసంహరించుకోవాలని అస్సాం ప్రభుత్వం అన్ని డిప్యూటీ కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఆమోదయోగ్యం కాదు” అని అన్నారు.
“AASU ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నిరసనగా, మేము ఈరోజు అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలలో ఈ ఉత్తర్వు కాపీలను దహనం చేసాము. CAAకి వ్యతిరేకంగా మా వైఖరిని మేము పునరుద్ఘాటిస్తున్నాము. విదేశీయుల ట్రిబ్యునళ్లలో అక్రమ హిందూ బంగ్లాదేశీయులను సమర్థవంతంగా రక్షించే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము” అని ఆయన అన్నారు.
అస్సాం ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయాలనే AASU స్థిరమైన డిమాండ్‌ను ఉత్పల్ శర్మ కూడా పునరుద్ఘాటించారు.
“మార్చి 24, 1971కి ముందు అస్సాంలోకి ప్రవేశించిన వారు మాత్రమే – మతంతో సంబంధం లేకుండా – భారత పౌరసత్వానికి అర్హులు. ఆ తర్వాత వచ్చిన ఎవరైనా, హిందూ లేదా ముస్లింలను గుర్తించి బహిష్కరించాలి. అదే మా వైఖరి,” అని విద్యార్థినేత శర్మ అన్నారు.
ప్రభుత్వం ఆదేశాన్ని ఉపసంహరించుకుని అస్సాం ఒప్పందం రాజ్యాంగ, చారిత్రక పవిత్రతను సమర్థించే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని ఆయన ప్రకటించారు.