30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

బిల్కిస్ బానో కేసు… కేంద్రానికి, గుజరాత్‌కు సుప్రీం నోటీసులు!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో 11 మంది దోషులను ప్రభుత్వం క్షమాభిక్ష కింద విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం గుజరాత్‌ సర్కార్‌ నుంచి వివరణ కోరింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం… కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే శిక్షా కాలం తగ్గింపు పొందిన వ్యక్తుల్ని కూడా ఈ కేసులో కక్షిదారులుగా చేర్చాలని పిటీషనర్లను ఆదేశించింది.

గుజరాత్ నిబంధనల ప్రకారం, దోషులు ఉపశమనం పొందేందుకు అర్హులా కాదా?. ఉపశమనాన్ని మంజూరు చేసేటప్పుడు దరఖాస్తును ఎలా పరిగణనలోకి తీసుకున్నారో చూడాల్సి ఉందంటూ అంటూ సుప్రీం బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఈ మేరకు గుజరాత్‌ ప్రభుత్వం దోషుల విడుదలపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

2002 గోద్రా అల్లర్ల సమయంలో గర్భవతిగా ఉన్న బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో 11 మంది నిందుతులకు 2008 జనవరిలో ముంబైలోని సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత ముంబై హైకోర్టు శిక్షను సమర్థించింది. 15 సంవత్సరాలకుపైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత దోషుల్లో ఒకరు రిమిషన్‌ పిటిషన్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రిమిషన్‌ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు గుజరాత్‌ సర్కార్‌ను ఆదేశించింది. ఇక తన రిమిషన్‌ పాలసీ ప్రకారం జీవిత ఖైదుగా అనుభవిస్తున్న మొత్తం 11 మంది దోషులను విడుదల చేయడానికి గుజరాత్‌ ప్రభుత్వం అనుమతించింది. గత వారం వారు గోద్రా జైలు నుంచి విడుదలయ్యారు.

దోషుల  విడుదలపై బాధితురాలితో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయంగానూ గుజరాత్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దోషుల విడుదలను నిరసిస్తూ సీపీఐ పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రా, సహ పలువురు మహిళ హక్కుల కార్యకర్తలు రేవతి లాల్, రూపా రేఖా వర్మలు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles