హైదరాబాద్: నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఖరీదైన గంజాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద నుంచి రూ.13.3 కోట్లు విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు మంగళవారం తెల్లవారుజామున 6ఈ1088 ఇండిగో విమానంలో బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, ముందస్తు సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు ఆమె బ్యాగులను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఆకుపచ్చని ముద్ద పదార్థం ఉన్న 20 ప్యాకెట్లు బయటపడ్డాయి. పరీక్షలో ఆ పదార్థం గంజాయిగా నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్లో సుమారు రూ.13.3 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
1985 నాటి నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టంలోని నిబంధనల కింద ప్రయాణికుడిని అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
కాగా, గత నెల 30న కూడా బ్యాంకాక్ నుంచి వచ్చిన మరో మహిళ వద్ద కూడా రూ. 40 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శంషాబాద్ విమానాశ్రయంలో తరుచూ గంజాయి పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.