చరిత్ర మరిచిన యోధులు వీరు
భారత దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టమైన స్వాతంత్య్రోద్యమం భారతీయుల పోరాట పటిమకు, త్యాగ నిరతికి ఒక నిలువుటద్దం. ఇలాంటి పోరాటంలో దేశంలోని అతి పెద్ద అల్ప సంఖ్యాక వర్గమైన ముస్లింలు తమదైన బాధ్యతాయుత పాత్రను పోషించారు. అపూర్వ త్యాగాలతో పునీతులయ్యారు. అయినా వారి త్యాగమయ చరిత్ర పలు కారణాల వల్ల మరుగున పడిపోయింది. కానీ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే భారత స్వాతంత్య్ర సాధనకు ముస్లింలు చేసిన కృషి ఎంత అమూల్యమైనదో తెలుస్తుంది. కొందరు చరిత్రకారులు, రచయితలు ఈ విషయంలో కృషి చేసి ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల గురించి ప్రపంచానికి తెలియజేశారు.
బ్రిటిషర్ల దురాగతాలను అడ్డుకున్న మొదటి మొనగాడిగా బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌల ప్రఖ్యాతి గాంచాడు. ప్రథమ స్వాతంత్య్ర సమరానికి ముందే బ్రిటీష్ పాలకులకు తొత్తులైన బెంగాల్ జమీందార్లకు వ్యతిరేకంగా 1763లో ముస్లిం ఫకీర్లు మజ్నూషా నేతృత్వంలో తిరుగుబాటు చేశారు. ఇది ఫకీర్లు-సన్యాసుల ఉద్యమంగా ఖ్యాతి గాంచింది. 1820-1870 మధ్య ముస్లిం నాయకుల నేతృత్వంలో వహాబీ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ బ్రిటిషర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. కానీ స్వదేశీ పాలకులు ఆయనతో కలిసి రాలేదు. ”స్వదేశీ పాలకులు టిప్పు మాటను గౌరవించి ఉంటే ఈనాడు ఈ నేల మీద మేం పాలకులుగా ఉండేవాళ్లం కాదు” అని బ్రిటిష్ పాలకులు ప్రకటించారంటే టిప్పు ఎంత గట్టిగా బ్రిటిష్ పాలకులను ఎదిరించాడో అర్థమవుతుంది.
ఆ తర్వాత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా ప్రసిద్ధి చెందిన 1857 తిరుగుబాటు కూడా ముస్లిం పాలకుడైన మొఘల్ పాదుషా బహద్దూర్ షా జాఫర్ నాయకత్వంలో జరగడం మనార్హం. ఈ ఉద్యమంలో విక్టోరియా మహారాణి ప్రకటనకు దీటుగా అవధ్‌కు చెందిన బేగం హజరత్ మహల్ భారతీయులను హెచ్చరిస్తూ ఒక ప్రకటన చేశారు. ఆత్మ గౌరవంతో, ధర్మబద్ధంగా ప్రశాంత జీవితం సాగించాలంటే స్వదేశీ పాలన కోసం శత్రువులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టండని ఆమె పిలుపునిచ్చారు.
ప్రజల్లో దేశభక్తి భావన పెంపొందించేందుకు పయామే ఆజాది పత్రికను అజీముల్లా ఖాన్ హిందీ, ఉర్దూ భాషల్లో ప్రచురించారు. ఆనాడు బ్రిటీష్ పాలకులను అడుగడుగునా ఎదిరించిన యోధుల్లో మౌలానా లియాఖత్ అలీ ఖాన్, హిక్మతుల్లా ఖాన్, ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుల సేనాని మహమ్మద్ భక్త్ ఖాన్, షెహజాదా ఫిరోజ్ షా, ఝాన్సీ రాణిని తిరుగుబాటుకు పురి కొల్పిన బక్షీస్ అలీ ప్రధాన పాత్ర పోషించారు. ఆనాటి పోరులో హిందూ-ముస్లింల ఐక్యతకు ప్రతీకగా ఖాన్ బహద్దూర్ ఖాన్ నిలిచారు.
ప్రథమ స్వాతంత్య్ర పోరాటంలో ముస్లిం మహిళలు కూడా అసంఖ్యాకంగా పాల్గొన్నారు. ఇందులో మహిళా సైనిక దళాలు ఏర్పాటు చేసి, నానా సాహెబ్ పక్షాన రణరంగంలో వీర విహారం చేసిన పాతికేళ్ల యువతి అజీజున్ మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో 27 వేల మంది ముస్లిం స్త్రీ, పురుషులను బ్రిటిష్ సైన్యాలు ఊరి తీశాయి, తగుల బెట్టాయి. మరో 30 వేల మందిని ప్రవాస శిక్షలకు గురి చేశాయి. నాటి సంగ్రామాన్ని ఆంగ్లేయాధికారి హెన్నీ మీడ్ ఇస్లామిక్ తిరుగుబాటుగా అభివర్ణించడాన్ని బట్టి ఆనాడు పోరాటంలో ముస్లింలు ఎంతో వీరోచితంగా పోరాడారో మనకు అర్థమవుతుంది.
బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసిన వారిలో తెలంగాణకు ఎందిన పఠాన్ తుర్రేబాజ్ ఖాన్ ముఖ్యులు. 1857లో ఆయన హైదరాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారు. దీంతో ఆయనపై ప్రతీకారం పెంచుకున్న బ్రిటిష్ పాలకులు అతి కష్టం మీద ఆయనను బంధించి హైదరాబాద్ నడి బొడ్డున ఆయనను ఉరి తీశారు. మరోవైపు విశాఖపట్నం బ్రిటిష్ సైన్యంలో సైనికాధికారిగా పని చేసిన సుబేదార్ అహమ్మద్ కూడా ఆనాటి తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఆయనను కూడా బ్రిటిష్ అధికారులు ఫిరంగి రంధ్రానికి కట్టి పేల్చేశారు.
ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ తొలి రోజుల్లో బద్రుద్దీన్ తయ్యాబ్జీ, రహమతుల్లా సయాని లాంటి ప్రముఖులు కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించి స్వాతంత్య్ర సమరంలో చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటిష్ పాలకులు హిందూ-ముస్లింల మద్య విభజన తెచ్చి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించినప్పుడు జాతీయోద్యమంలో పాల్గొనడం ముస్లింల విధిగా పేర్కొంటూ ఉలెమాలు కొందరు విస్తృతంగా ఫత్వాలు జారీ చేశారు. నమాజ్ చేయడం ఎంతటి విధో.. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడటం కూడా అంతే తప్పనిసరి విధిగా మౌలానా ముహమ్మద్ లాంటి వారు పేర్కొన్నారు.
విప్లవ గ్రూపులు బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడిన అగ్ని యుగంగా పిలువబడే కాలంలో గదర్ పార్టీలో డాక్టర్ బర్కతుల్లా, డాక్టర్ మన్సూర్, అబ్దుల్ వహబ్ ప్రధాన పాత్ర పోషించారు. ఆనాడు భారతీయ సైనికుల్లో తిరుగుబాటును ప్రోత్సహిస్తూ గాలిబ్ పాషా లేఖలు రాశారు. ఆ తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ లాంటి నాయకులు పోరాడారు. వారికి బ్రిటిష్ ప్రభుత్వం విధించిన శిక్షకు నిరసనగా జరిగిన జలియన్‌వాలాబాగ్ లో ప్రజలు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో బ్రిటిష్ అధికారులు జరిపిన కాల్పుల్లో 55 మంది ముస్లింలు మరణించారు.
తన దేశంలోని కుక్క పిల్లలు కూడా బ్రిటిష్ బానిస సంకెళ్లలో బందీలుగా ఉండరాదన్నది తన అభిమతమని ఆబాది బేగం బానో గర్జించారు. జాతీయోద్యమంలో చిచ్చరి పిడుగుగా ప్రసిద్ధుడైన హసరత్ మెహాని 1921 నాటి కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం ప్రతిపాదన ప్రవేశపెట్టారు. మలబార్లో మోప్లాల తిరుగుబాటుకు మౌలీ అలీ ముస్సలియార్ నేతృత్వం వహించారు. అష్ఫాఖుల్లా ఖాన్ లాంటి యువకులు హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ లాంటి విప్లవ సంస్థల్లో సభ్యులై బ్రిటిషర్లపై సాయుధ పోరాటం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు చేసిన పోరాటానికి డిప్యూటీ కలెక్టర్ ఫజులుల్లా ఖాన్ ప్రేరణగా నిలిచారు.
1927లో సైమన్ కమిటీ గో బ్యాక్ అంటూ ముంబై లో జరిగిన భారీ ప్రదర్శనకు యువ నాయకుడు యూసుఫ్ మెహరాలి నాయకత్వం వహించారు. చిట్టగాంగ్ విప్లవ వీరులకు ముస్లిం యువకులు రక్షణగా ఉంటూ గమ్య స్థానాలకు చేర్చేవారు. 1930లో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో సరిహద్దు గాంధీగా ప్రసిద్ధులైన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ తన సోదరుడితో కలిసి అహింసా యోధుల దళాన్ని (రెడ్ షర్ట్స్) ఏర్పాటు చేసి స్వాతంత్య్రం కోసం పోరాడారు. దేశ స్వాతంత్య్ర పోరాటానికి చివర్లో ఊపిరులూదిన క్విట్ ఇండియా ఉద్యమానికి నినాదం అందించిన ఘనత యూసుఫ్ మెహర్ అలీకి దక్కుతుంది. ఇక నేతాజీ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో జనరల్‌గా షానవాజ్, కల్నల్ గా అజీజ్ అహ్మద్, యం.కె.ఖైనీ ప్రధాన బాధ్యత నిర్వహించారు.
1946 ఫిబ్రవరిలో జరిగిన రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటులో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వ కాల్పుల్లో మరణించినవారిలో అత్యధికులు ముస్లింలే. 1940 నుంచి 1947లో స్వాతంత్య్రం వచ్చే వరకు గాంధీజీ, మౌలానా ఆజాద్ ఇద్దరూ జాతీయోద్యమానికి మార్గదర్శకత్వం వహించారని చెప్పవచ్చు. జాతీయవాద ముస్లిం నాయకులు దేశ విభజనను కూడా వ్యతిరేకించారు. ఈ విధంగా భారతీయ ముస్లింలు దేశ స్వాతంత్య్ర పోరాటం కీలక పాత్ర పోషించారు. ఇన్నిన్ని త్యాగాలు చేసిన ముస్లిమ్ యోధులను చరిత్ర పుస్తకాల్లో మాత్రం సముచితమైన స్థానం దక్కలేదు.
-ముహమ్మద్ ముజాహిద్, 9640622076