న్యూఢిల్లీ: దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎర్రకోటపై వరుసగా 12వసారి జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ… పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామన్నారు. దానికి సమాధానంగానే ఆపరేషన్ సిందూర్ చేపట్టి శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టాం. భారత దళాల శౌర్యం, పెద్ద ఎత్తున విధ్వంసం చూసిన పాకిస్తాన్ నిద్ర చెదిరిపోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చే వారి మధ్య భారతదేశం తేడాను గుర్తించదని, పొరుగు దేశం నుండి భవిష్యత్తులో ఏదైనా దుస్సాహసం జరిగితే భారత సాయుధ దళాలు శిక్షను నిర్ణయిస్తాయని కూడా ఆయన అన్నారు.
“ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సాయుధ దళాలు ఏమి చేశాయో కనిపించలేదు. పహల్గామ్ దాడి వెనుక ఉన్నవారిని… వారి ఊహకు మించి శిక్షించిన మన సైనికులకు నేను సెల్యూట్ చేస్తున్నాను” అని ప్రధాన మంత్రి ఎర్రకోట ప్రాకారాల నుండి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు.
పాకిస్తాన్‌లో మన సాయుధ దళాలు చేసిన విధ్వంసం ఎంత విస్తృతంగా జరిగిందంటే ప్రతిరోజూ కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఉగ్రవాదాన్ని తమ ఊహకు అందని విధంగా శిక్షించిన మన సైనికులకు నేను సెల్యూట్ చేస్తున్నాను” అని ఆయన అన్నారు.
ఆపరేషన్ సిందూర్ అనేది మన దళాల శౌర్యం, ఖచ్చితత్వానికి ఒక శక్తివంతమైన నిదర్శనమని మోదీ అన్నారు. “ఏప్రిల్ 22 (పహల్గామ్ దాడి) తర్వాత, ఉగ్రవాదులకు ప్రతిస్పందించడానికి మేము సాయుధ దళాలకు స్వేచ్ఛ ఇచ్చాము. శత్రుమూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుంది. లక్ష్యం, సమయం ఎంచుకునే స్వేచ్ఛ త్రివిధ దళాలకే ఇచ్చాం అని ఆయన అన్నారు.
“మా దళాలు వందల కిలోమీటర్లు శత్రు భూభాగంలోకి దాడి చేసి పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లో ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) ప్రధాన కార్యాలయాన్ని విధ్వంసం చేశారు. ఇతర చోట్ల శిక్షణా శిబిరాలను నాశనం చేశారని ప్రధాని అన్నారు.
సరిహద్దులో త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా…పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది, ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది మరణించారు, ఇందులో ఎక్కువగా పర్యాటకులు ఉన్నారు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అణ్వాయుధ బెదిరింపుకు, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సహా అనేక మంది పాకిస్తాన్ నాయకులు భారతదేశంపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడడనే విషయాన్ని మోదీ తేల్చి చెప్పారు.
గత వారం ఫ్లోరిడాలోని టంపాలో ప్రసంగించిన మునీర్, భారతదేశంతో భవిష్యత్తులో జరిగే యుద్ధంలో తమ ఉనికికి ముప్పును ఎదుర్కొంటే పాకిస్తాన్ అణ్వాయుధాలను ఉపయోగించి భారతదేశం సహా “సగం ప్రపంచాన్ని” కూల్చివేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.