ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత వేడుకగా జరుపుకునే క్షణం…78 సంవత్సరాల క్రితం వచ్చిన స్వాతంత్ర్య దినోత్సవం. అయితే భిన్నత్వంలో ఏకత్వంగా మెలిగిన భారతదేశం నేడు, మత ప్రాతిపదికన విభజితమైంది. దీంతో మన సాంస్కృతిక సమాజంపై నీలినీడలు కమ్ముకున్నాయి. విచారకర విషయం ఏంటంటే… నేడు చాలా మంది భారతీయులు లౌకికవాదం ఒక చెడ్డ పదం అని భావిస్తున్నారు. మన దేశం హిందూ రాజ్యంగా మార్చాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆలస్యం కాకముందే మనం మేల్కోవాలి. మత సహనం, సమానత్వం, విభిన్న విశ్వాసాల పట్ల గౌరవం అనే ఘనమైన వారసత్వాన్ని తిరిగి పొందేందుకు కృషి జరపాలి.
క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో మనం శిఖరాగ్రంలో ఉన్నప్పుడు, అశోక చక్రవర్తి బౌద్ధమతాన్ని స్వీకరించాడు, కానీ ఒక శాసనాన్ని ప్రకటించాడు: “ఒకరు మరొకరి మతాన్ని గౌరవించాలని అన్నాడు.
8వ శతాబ్దం నుండి ముస్లిం పాలకులు వచ్చినప్పటికీ, ఈ సంప్రదాయాలు మనుగడలో ఉన్నాయి. ఔరంగజేబు వంటి కొంతమంది ముస్లిం చక్రవర్తులు ఇతర మతాలను అణచివేశారని అపవాదు వేశారు. కానీ అక్బర్ వంటివారు తన మంత్రివర్గంలో వివిధ విశ్వాసాలకు చెందిన సభ్యులను నియమించి, ఒక సమకాలీన మతం…దీన్-ఎ-ఇలాహిని ప్రోత్సహించాడు.
18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు వచ్చినప్పుడు, భారతదేశం ఇప్పటికీ హిందువులు, ముస్లింల మధ్య బలమైన స్నేహ భావాలను అనుభవించింది. 1857లో వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కలిసి తిరుగుబాటు చేశారు. భారతదేశ చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ నాయకత్వంలో ఐక్యమయ్యారు. రాణి లక్ష్మీబాయి, బేగం హజ్రత్ మహల్ వంటి హిందూ, ముస్లిం పాలకులు ఇద్దరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు.
భారతదేశ లౌకిక సంస్కృతి… స్వాతంత్ర్య ఉద్యమంలోనూ కొనసాగింది. కాంగ్రెస్, ముస్లిం లీగ్‌లకు ప్రాతినిధ్యం వహించిన మోతీలాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా మధ్య 1916 ఒప్పందం హిందూ-ముస్లిం సహకారానికి చిహ్నంగా ప్రశంసలకు నోచుకుంది. కాంగ్రెస్ నాయకుడు గోపాల కృష్ణ గోఖలే జిన్నాను “హిందూ-ముస్లిం ఐక్యతకు ఉత్తమ రాయబారి” అని అభివర్ణించారు. మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించినప్పుడు, అతను మత సంఘీభావాన్ని కొత్త శిఖరాలకు పెంచాడు.
భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు ఈ పురాతన బంధుత్వం చాలా ఒత్తిడికి గురైంది. దేశ విభజన స్వతంత్ర భారతదేశంలోని రెండు అతిపెద్ద వర్గాల మధ్య విబేధాలకు ఆజ్యం పోసింది. 1990లలో హిందూత్వం ప్రధాన స్రవంతిలోకి వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో హిందూ రాజ్యం ఏర్పడాలంటూ అనేక మంది హిందువులు ర్యాలీ చేస్తున్నారు.
ముస్లిం మైనారిటీలు భారతదేశ సంక్షేమానికి కట్టుబడి లేరని హిందూత్వ అనుచరులు భావిస్తున్నారు. ఈ భావన రోజురోజుకూ బలపడి ద్వేషంగా మారుతోంది. ఫలితంగా నేడు భారతదేశంలోని ముస్లింలు, హిందువులు చాలా మంది భయపడుతున్నారు.
భారతదేశం తన పురాతన బహుళ సాంస్కృతిక విలువలను నిలుపుకోవాలనుకుంటే, మతం ఆధారంగా ఏర్పడ్డ ద్వేషం అంతం కావాలి. మత వివక్షను రాజ్యాంగబద్ధంగా నిషేధించాలి.
ప్రభుత్వాలు అన్ని మతాల నుండి సూత్రప్రాయంగా దూరం ఉంచితే లేదా వాటిని సమానంగా ప్రోత్సహిస్తే భారతదేశ లౌకికవాదం మనుగడ సాగించగలదని చాలా మంది భారతీయ ఆలోచనాపరులు నమ్ముతారు. కానీ వారు చాలా మంది రాజకీయ నాయకుల నుండి చాలా ఆశిస్తున్నారు.