న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానమంత్రి వివాదాస్పద ప్రసంగం చేశారు. అక్రమ వలసలను ముప్పుగా అభివర్ణించారు. జనాభా మార్పును లక్ష్యంగా చేసుకుని “సముచిత ప్రణాళికతో కూడిన కుట్ర” గురించి హెచ్చరించాలనుకుంటున్నాను. దానికోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయని మోడీ విద్వేష వ్యాఖ్యలు చేశారు.
అధికారులు “అక్రమ వలసదారుల”పై చర్యలు తీసుకున్న తర్వాత మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనేక మంది బంగ్లాదేశ్ పౌరులు…కార్మికులుగా మన దేశంలో ఉండటానికి నకిలీ పత్రాలను సమర్పించారని ప్రధాని ఆరోపించారు.
“ఈ చొరబాటుదారులు మన సోదరీమణులు, కుమార్తెలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారు ఆదివాసీలను తప్పుదారి పట్టించి వారి భూములను దొంగిలించారు. దీనిని సహించకూడదని మోడీ అన్నారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో జనాభా మార్పును జాతీయ సమస్యగా ఆయన అభివర్ణించారు.
“ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఉన్నత స్థాయి జనాభా మిషన్ను ప్రారంభిస్తున్నట్లు నేను ప్రకటిస్తున్నాను” అని ఆయన అన్నారు. దేశం “చొరబాటుదారుల”కు తలొగ్గకూడదని ప్రధాని అన్నారు.
కాగా, ప్రధాని మోడీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బంగ్లాదేశ్ వ్యతిరేక చర్య పేరుతో అక్రమ బెంగాలీ మాట్లాడే ముస్లిం వలస కార్మికులను పార్టీ లక్ష్యంగా చేసుకుందని మమతా బెనర్జీతో సహా చాలా మంది నాయకులు ఆరోపించారు.